DK Aruna challenge to CM Revanth : మహబూబ్‌నగర్‌లో చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళ అని చూడకుండా రేవంత్ నీచంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఆమె మాట్లాడారు. తనను ఎదుర్కొనేందుకు గుంపులుగా వచ్చి, ముప్పేట దాడి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన అరు గ్యారంటీలపై మాట్లాడకుండా రేవంత్ రెడ్డి పాలమూరుకు వచ్చి నోటికొచ్చినట్లు తిట్టి పోతున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు. తన మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. మహిళను పట్టుకొని దొరసాని, తొక్కుతా అని నోటికొచ్చినట్లు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి బాటలు వేసినందుకు, ప్రాజెక్టుల కోసం పోరాడినందుకు తనను తొక్కాలనుకుంటున్నారా? అని ఎదురుదాడికి దిగారు.
పాలమూరుకు ఏం చేశారో చెప్పాలి : కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి ఓ మహిళను ఎలా అవమానిస్తున్నారో మహిళలు గమనించాలని అరుణ కోరారు. వచ్చే ఎన్నికల్లో అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రేవంత్ ఎమ్మెల్యే, ఎంపీగా ఉండి పాలమూరుకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ బాగోతాన్ని తానే విప్పుతానని సవాల్ విసిరారు. గద్వాల కోట గురించి, నీతి, జాతి గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదన్నారు.
ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ రాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని డీకే అరుణ సవాల్ విసిరారు. హామీలు నెరవేర్చకపోతే పదవిని వదిలేస్తారా అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయకుండా సానుభూతి కోసం కొత్త నాటకాలు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరులోనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చాక ఐదుసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు వచ్చారని గుర్తు చేశారు.
'రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను తిట్టినట్లే నన్ను తిడితే నేను, పాలమూరు ప్రజలు ఊరుకోరు. మహిళపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. మీరే ముఖ్యమంత్రులు కావాలి, మీరే పాలమూరు బిడ్డ అనిపించుకోవాలి. ఒక పాలమూరు ఆడబిడ్డగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి, ప్రజల్లో ఓ గుర్తింపు తెచ్చుకుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యావ్. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి చేసిందేమీ లేదు. పాలమూరు కోసం ఏనాడైనా పోరాటం చేశారా?' - డీకే అరుణ, బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి
రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి కోసం ఏనాడైనా పోరాటం చేశారా ? : డీకే ఆరుణ - Lok Sabha Elections 2024