MLA Harish Rao vs CM Revanth Reddy In Assembly : స్మార్ట్ మీటర్లపై నాటి బీఆర్ఎస్ సర్కార్ కేంద్రంతో చేసుకున్న ఒప్పందం తెలంగాణకు గుదిబండలా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే రైతులు ఉరి వేస్తారని ఎన్నికల ముందు నాటకాలు ఆడారని మండిపడ్డారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కేంద్రం డిస్కంలపై చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. "ఉదయ్" పథకం ఒప్పందం తీసుకొచ్చి సభను సీఎం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లపై చర్చ : విద్యుత్ మీటర్ల విషయమై శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. బడ్జెట్‌పై సాధారణ చర్చకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం అనంతరం బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు వివరణలు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేవనెత్తిన అంశంపై హరీశ్ స్పందిస్తూ ఉదయ్ పథకం ఒప్పందం తీసుకొచ్చి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ అంగీకరించారని సీఎం చెప్పారని ఆక్షేపించారు. మేము ప్రభుత్వంలో ఉండగా వ్యవసాయ మీటర్లకు పెట్టకూడదని రూ. 30వేల కోట్లు వదులుకున్నామని హరీశ్ స్పష్టం చేశారు.
హరీశ్‌రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి : దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని తాము ఎప్పుడూ చెప్పలేదని తలకిందులుగా తపస్సు చేసినా మీటర్లు పెట్టబోమన్నారు. తిరిగి హరీశ్‌రావు మాట్లాడుతుండగా జోక్యం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి అని ఒప్పందం అని తాను చెప్పలేదన్నారు. గత ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసుకున్నారని గుర్తు చేశారు.
స్మార్ట్ మీటర్లపై బీఆర్ఎస్ ఒప్పందం : బీఆర్ఎస్ తప్పులు ఒప్పుకుంటే వచ్చే సారి రెండు సీట్లైనా వస్తాయని, లేదంటే వార్డు మెంబర్ కూడా గెలవరని వ్యాఖ్యానించారు. గతంలో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రాష్ట్ర డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సీఎం స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పనిసరి పరిస్థితి వచ్చిందన్నారు. అనంతరం చర్చను ముగించిన శాసనసభాపతి ప్రసాద్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు.