Congress Public Meeting Arrangements in Tukkuguda : తెలంగాణ, కర్ణాటక శాసనసభ ఎన్నికల విజయాల స్ఫూర్తిని లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తున్న కాంగ్రెస్ తుక్కుగూడ వేదికగా దేశవ్యాప్త ప్రచారానికి సమరశంఖం పూరించనుంది. గతేడాది సెప్టెంబరు 17న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్కడి నుంచే సమరభేరి మోగించి ఆరు గ్యారంటీలు ప్రకటించగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అక్కడి నుంచే జాతీయస్థాయి మేనిఫెస్టో ప్రకటించనుంది.
Congress Jana Jatara Meeting : జనజాతర పేరిట తుక్కుగూడలో నిర్వహించనున్న బహిరంగసభ ద్వారా అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ఐదు గ్యారంటీలతో పాటు ఇతర హామీలను ప్రకటించనుంది. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీతో పాటు జాతీయ నేతలు హాజరుకానున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ వేదిక నుంచే సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించగా తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టినందున కలిసొచ్చిన తుక్కుగూడనుంచే లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.
Congress Focus on Lok Sabha Elections 2024 : రాష్ట్రఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి దూసుకెళ్లినట్టుగానే లోక్‌సభ ఎన్నికలకు ఇచ్చే ఐదు హామీలు, దేశంలోని అన్నిమూలలకు, అన్ని వర్గాల్లోకి వెళుతాయని కాంగ్రెస్ అధినాయకత్వం విశ్వసిస్తోంది. జాతీయస్థాయి మేనిఫెస్టో ప్రకటించే సభకి పార్టీ అగ్రనేతలు హాజరుకానుండటం, సెంటిమెంట్‌గా భావిస్తున్న తుక్కుగూడలో సభ జరుగుతున్నందున దీనిని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఔటర్ రింగ్‌రోడ్డు పక్కనే 60 ఎకరాల సువిశాలమైన మైదానంలో సభకు ఏర్పాట్లు చేస్తుండగా, వాహనాల పార్కింగ్ కోసం దాదాపు 300 ఎకరాలు కేటాయించారు.
లక్ష మందికిపైగా మహిళలు సభకు హాజరయ్యేలా ప్రణాళికలు : ఈనెల 6న జరిగే ఆ జనజాతరకు ఆదిలాబాద్ మొదలు అలంపూర్‌వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి జనాన్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 10 లక్షల మందిని తుక్కుగూడ సభకు తరలించాలని పీసీసీ భావిస్తోంది. ఇప్పటికే సభాస్థలిని పరిశీలించిన పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష మందికిపైగా మహిళలు సభకు హాజరయ్యేట్లు చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
Lok Sabha Elections 2024 : అందులో భాగంగా ఇద్దరు మహిళా మంత్రులతో పాటు కీలకమైన పదవుల్లో ఉన్న మరో ఇద్దరు మహిళా నేతలకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న గ్యారంటీల్లో స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానే సభలో ముందు వరసల్లో వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చేవారికిఏ ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఎండలు మండుతున్నందున వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఎక్కడిక్కడ మజ్జిగ, మంచినీళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఈనెల 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సభాస్థలిని పరిశీలించగా రోజుకో మంత్రి, ఇతర ముఖ్యనేతలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం నాడు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, ఇతర కీలక నాయకులు తుక్కుగూడలో బహిరంగసభ ఏర్పాట్లు పరిశీలించి క్షేత్రస్థాయిలోని నేతలకు దిశానిర్దేశం చేశారు.