Congress Leaders on Tukkuguda Public Meeting : తుక్కుగూడ ఇప్పుడది కాంగ్రెస్ పార్టీ నేతలకు మహొత్తర ప్రాంతంగా మారిపోయింది. ఇక్కడ నుంచి ప్రారంభ సభ మొదలుపెట్టి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, సార్వత్రిక ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేయాలనే సెంటిమెంట్‌తో ముందుకు వెళ్తోంది. ఆ దిశగానే తుక్కుగూడ కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు టీపీసీసీ సిద్ధమైంది. తెలంగాణ మోడల్‌ను దేశానికే అందించాలన్న లక్ష్యంతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
దశాబ్దం కాలం పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, నరేంద్ర మోదీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ పాలనకు చరమగీతం పాడాలనే కృతనిశ్చయంతో ఉంది. తుక్కుగూడలో గత ఏడాది సెప్టెంబరు 17న నిర్వహించిన సభలో, ఆరు గ్యారంటీలు(Congress Six Guarantees) ప్రకటించి అధికారంలోకి వచ్చామని, శనివారం నిర్వహించే జనజాతరలో దేశప్రజలకు ఏం చేయబోతున్నామో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటిస్తారని మంత్రులు వివరించారు. 70 ఎకరాల స్థలంలో సభకు ఏర్పాట్లు చేశామని, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.
Minister Seethakka on Tukkuguda Jana Jathara : తుక్కుగూడలో రేపు జరగబోయే కాంగ్రెస్ జనజాతర సభలో జాతీయ స్థాయి మేనిఫెస్టో వెల్లడించనున్నామని గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ఇదే ప్రదేశంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి, సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే ప్రతి హామీని అమలు చేస్తూ, మాట నిలబెట్టుకున్నట్లు వివరించారు.
"ఆనాడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి, ఆశీర్వదించి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావటానికి ప్రధాన వేదిక తుక్కుగూడ భారీ బహిరంగ సభ. మరి ఆరోజు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రతి పథకం, అర్హులైన పేదవాళ్లందరికీ చేరవేస్తూ ఇప్పటికి 100 రోజులు గడిచింది. పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కోడ్ రీత్యా ఇంకా కొన్ని పథకాలు అమలు చేయకపోయినా ప్రజలందరు కూడా మామీద ఎంతో నమ్మకంతో ఉన్నారు."-సీతక్క, మంత్రి
తెలంగాణ మోడల్‌ను దేశానికి అందించాలన్న లక్ష్యంతోనే - తుక్కుగూడ జన జాతర సభ - Lok Sabha Elections 2024
కాంగ్రెస్ మాట ఇస్తే కట్టుబడి ఉంటుందని తెలిపారు. అనంతరం తుక్కుగూడలోని సభ ప్రాంగణంలో జరగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సభకు 10 లక్షల మంది వస్తారని మంత్రి తెలిపారు. సభకు మహిళలు పెద్ద సంఖ్యలో రానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలానే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వస్తారని మంత్రి పేర్కొన్నారు.
70 ఎకరాల స్థలంలో సభ - 550 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు : కాంగ్రెస్ జనజాతర సభ పది లక్షల జనాభా వస్తారని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు(IT Minister Sridhar Babu) ఆశాభావం వ్యక్తం చేశారు. సభ కోసం 70 ఎకరాల స్థలం, 550 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బూత్ స్థాయి నుంచి సభకు వచ్చే ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఎండ తీవ్రత తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. సభా వేదికగా ఏఐసీసీ మేనిఫెస్టోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రిలీజ్ చేస్తారని మంత్రి వెల్లడించారు.
"ఈ పదేళ్ల కాలం నుంచి అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది, దేశానికి, దేశ ప్రజలకు సంబంధించి అందరికీ న్యాయం జరిగేలా మా మ్యానిఫెస్టో రూపుదిద్దడం జరిగింది. ఒక ప్రత్యేకమైన చొరవ చూపెడుతూ అటు రైతులు, కార్మికులు, యువత, మహిళలకు ప్రధానంగా ఎంచుకోబడిన వర్గాలకు రేపు రాహుల్ గాంధీ రిలీజ్ చేసే మ్యానిఫెస్టోలో స్పష్టంగా చెప్పటం జరుగుతుంది."-శ్రీధర్‌బాబు, మంత్రి