Congress Jana Jatara Sabha In Tukkuguda : తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ ద్వారా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ జరిపి ఆరు గ్యారంటీలను ప్రకటించడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, లోక్‌సభ ఎన్నికలకు అక్కడే మరింత ఎక్కువగా జన సమీకరణ చేసి ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల మేనిఫెస్టోను లాంఛనంగా విడుదల చేసిన ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే ఐదు గ్యారంటీల గురించి చెప్పడమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణం : మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీలు ఉన్నాయని, ఎక్కడికైనా మోదీ వచ్చే ముందే ఈడీ వస్తుందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. రైతులకు ఒక్క రూపాయి మాఫీ చేయని మోదీ ప్రభుత్వం, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణానికి తెరతీసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందుకే అవినీతిపరులందరినీ బీజేపీలోకి చేర్చుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు.
Rahul Gandhi on Phone Tapping Case : రాష్ట్రంలో దర్యాప్తులో ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అధిక ప్రాధాన్యమిచ్చిన రాహుల్ గాంధీ, గత ప్రభుత్వం వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేసిందని విమర్శించారు. ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేశారో విచారణలో బయటపడుతుందన్నారు. ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా మూసీ నదిలో పడేశారని ధ్వజమెత్తారు. వ్యాపారులను బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. అప్పుడు రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిందే, ఇప్పుడు కేంద్రంలో ప్రధాని మోదీ చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంపై ఆరా తీసిన రాహుల్ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోందనే విషయమై రాహుల్ గాంధీ ముఖ్య నేతలను ఆరా తీశారు. గ్యారంటీల అమలుపై ప్రజల స్పందన, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ ప్రణాళిక తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జనజాతర సభకు ప్రజల సమీకరణ, వారి స్పందన బాగున్నాయని రాహుల్ అభినందించినట్లు సమాచారం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వేదికపై రాహుల్‌గాంధీ కాసేపు ముచ్చటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పని చేసేందుకు తుక్కుగూడ సభ ఎంతగానో దోహదపడుతుందనే అభిప్రాయాన్ని పార్టీశ్రేణులు వ్యక్తం చేశాయి. భారీగా జన సమీకరణపై ఎండల ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన నెలకొన్నా, అలాంటిది లేకుండా జనం తరలిరావడం నాయకుల్లో ఉత్సాహాన్ని నింపింది.