Congress Govt Focused On Funds Collection For Crop Loan Waiver : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.2లక్షలలోపు రుణాలను మాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఆగస్టు 15కల్లా రుణమాఫీ చేసి తీరతామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం మొత్తంగా రూ.31వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. మంత్రివర్గ ఆమోదంతో మాఫీ అమలు మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేయగా కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పష్టతనిచ్చారు. లక్ష రూపాయల్లోపు రుణాలను ఈ నెల 18న మాఫీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే బడ్జెట్ విడుదలకు సైతం ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం.
రెండు లక్షల రూపాయల రుణమాఫీకి మొత్తం రూ.31వేల కోట్లు అవసరం. అందులో లక్ష రూపాయల కంటే తక్కువ ఉన్న రుణాల మొత్తం మూడో వంతు లోపు మాత్రమే ఉంటుందని సమాచారం. వాటిని మాఫీ చేసేందుకు 7వేల నుంచి 8వేల కోట్లు అవసరం ఉంటుందని చెబుతున్నారు. అందుకు సరిపడా మొత్తాన్ని ఆర్థిక శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం. ఎఫ్‌ఆర్బీఎమ్‌పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర మార్గాల్లో వచ్చిన నిధులను ఇందుకోసం సిద్దంగా ఉంచినట్లు తెలిసింది.
మొదటి దఫాకు సిద్ధం : జులై నెలలో బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల కోట్లు సమీకరించింది. ఇతర మార్గాల్లో మరో రూ.5వేల కోట్ల వరకు నిధులను సేకరించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మొదటి దఫా లక్ష రూపాయల్లోపు రుణమాఫీకి అవసరమైన నిధులు సర్కార్ వద్ద సిద్ధంగా ఉన్నాయి.
నిధుల సమీకరణపై కసరత్తు : రెండో విడతలో లక్షన్నర వరకు ఉన్న రుణాలను, తర్వాత మిగిలిన అప్పులను మాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. లక్షన్నర వరకు ఉన్న రుణాల మాఫీకి సైతం మరో రూ.8 వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా. మిగిలిన రుణాల మాఫీకి మరో రూ.15 వేల కోట్లు వరకు కావాల్సి ఉంటుందని సమాచారం.రెండో విడతతో పాటు మిగిలిన మొత్తానికి అవసరమైన నిధులకు సైతం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ చేయాల్సిందేనంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన రోజు నుంచే నిధులను సమీకరించే ప్రణాళికపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రేపే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బు - ఈ పథకానికి అర్హులు ఎవరు? - Pratidhwani ON RYTHU RUNA MAFI