Congress Focus On Lok Sabha Elections 2024 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపు, లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల వాతావరణం నేపథ్యంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండగా అందుకోసం టికెట్ వచ్చిన అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమాలన్నింటితో పాటు అదే సందర్భంలో నిర్వహించే బహిరంగ సభలకు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
Congress Public Meeting In Telangana : రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగానూ అభ్యర్థుల ఎంపిక పూర్తైన 14నియోజకవర్గాల్లో ఈ నెల 12 నుంచి 18వరకు వారం రోజుల పాటు సమావేశాలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బూత్ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు నేతలను ఒకచోట సమావేశపర్చి పార్టీ విధివిధానాలు, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లటం, రాష్ట్రంలో వందరోజుల పాలన, ప్రత్యర్థి బీజేపీ, బీఆర్ఎస్లను ఎదుర్కొనే అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిన్న జరిగిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సమన్వయకర్తలకు సీఎం దిశనిర్దేశం చేశారు.
Congress Elections Campaign 2024 : రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో కనీసం 3 బహిరంగ సభలు నిర్వహించేందుకు పీసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 17లోక్‌సభ స్థానాల్లో ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందో ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రత్యేకంగా బహిరంగ సభలు నిర్వహించాలని నేతలు యోచిస్తున్నారు. ఎన్నికల వేళ నిర్వహించే బహిరంగ సభలకు పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకా గాంధీలను ఆహ్వానించనున్నారు.
తెలంగాణ బహిరంగ సభలకు ప్రియాంకా గాంధీ : ఈ నెల 21న భువనగిరి అభ్యర్ధి చామల కిరణ్‌కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. మే తొలివారంలో మిర్యాలగూడ, చౌటుప్పల్‌లో జరిగే బహిరంగ సభలకు ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో కోమటిరెడ్డి సోదరులకు పట్టుండడంతో అక్కడి అభ్యర్థి గెలుపు బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి అప్పగించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - హాట్ హాట్‌గా అగ్రనేతల ప్రసంగాలు - Lok sabha elections 2024