CM Revanth Reddy Tweet Today : ఏడాది ప్రజాపాలన ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను, ఆత్మ బలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను అన్నింటినీ కలిపి రాసిన వీలునామాను గతేడాది ఇదే రోజున తెలంగాణ తన చేతుల్లో పెట్టిందని సీఎం పేర్కొన్నారు. తన వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తనకు తెలంగాణ అప్పగించిందన్నారు. ఆ క్షణం నుంచి జన సేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో సకల జనహితమే పరమావధిగా, జాతి ఆత్మ గౌరవమే ప్రాధాన్యతగా ముందుకు సాగిపోతున్నామంటూ ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
సహచరుల సహకారంతో, జనహితుల ప్రోత్సాహంతో, విమర్శలను సహిస్తూ, విద్వేషాలను ఎదురిస్తూ, స్వేచ్ఛకు రెక్కలు తొడిగి ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచినట్లు సీఎం వ్యాఖ్యానించారు. అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలిపేందుకు గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ, 4 కోట్ల ఆశయాలను నడిపిస్తూ నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా, విరామం లేకుండా, విశ్రాంతి కోరకుండా ముందుకు సాగిపోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. సమస్త ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడమే తన సంప్రాప్తి అని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన ఏడాది పాలనపై హర్షం వ్యక్తం చేశారు.
పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను...
— Revanth Reddy (@revanth_anumula) December 7, 2024
ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను...
అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి...
డిసెంబర్ 7, 2023 నాడు...
తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.
తన వారసత్వాన్ని సగర్వంగా...
సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే
బాధ్యతను అప్పగించింది.
ఆక్షణం నుండి...
జన… pic.twitter.com/z31HWss8ZZ
నేటి నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు : ప్రజా పాలన విజయోత్సవాల ముగింపు ఉత్సవాలు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో సంబురాలకు సన్నాహాలు చేసింది. ఇవాళ సాయంత్రం వందేమాతరం శ్రీనివాస్ సంగీత ప్రదర్శన చేయనున్నారు. అలాగే రేపు (ఆదివారం) వైమానిక విన్యాసాలు, రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. చివరి రోజైన డిసెంబరు 9వ తేదీన సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇదే రోజు సంగీత దర్శకుడు థమన్ మ్యూజికల్ నైట్, డ్రోన్, బాణాసంచా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల మూడు రోజులు ప్రముఖ ప్రాంతాలతో పాటు కట్టడాలు జిగేల్ మనేలా విద్యుత్ లైట్లతో అలంకరించనున్నారు.
హుస్సేన్‌సాగర్ వద్ద అద్భుత వైమానిక విన్యాసాలు - మీరూ వెళ్లి చూసొచ్చేయండి