CM Revanth Reddy on New Industrial Policies : ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించిన ఆరు నూతన పాలసీలు తయారు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
ఎంఎస్ఎంఈ, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వాహనాల సవరించిన విధానాలు రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు. టెక్స్ టైల్స్ రంగానికి సంబంధించి పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా పాలసీలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
CM Revanth Tirumala Tour Today : ఈ పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీలకు సంబంధించి సమీక్ష ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. ఇవాళ రాత్రి ఆయన అక్కడే బస చేయనున్నారు. బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి రానున్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సీఎం నివాళి : ఉదయం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని తెలిపారు. ఆయన వల్లే ఈ రోజు ఐటీ రంగం పురోగతిని సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, నేతలు హన్మంతరావు, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.