CM Revanth Jana Jatara Sabha in Narsapur : గత కొన్ని దశాబ్దాలుగా మెదక్ ప్రాంతం బీజేపీ, బీఆర్ఎస్ చేతుల్లో మగ్గిపోయిందని, ఆ పార్టీల నుంచి విముక్తి పొందేలా ఈ దఫా కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభకు హాజరైన సీఎం సహా ఇతర మంత్రులు, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు : ఈ క్రమంలోనే మాట్లాడిన రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్ అభ్యర్థులపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలను మోసం చేసిన వ్యక్తే ఇవాళ మెదక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చనందునే రఘునందన్ రావు ఓడిపోయారని అన్నారు. ప్రజల భూములు లాక్కున్న వ్యక్తి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీలో ఉన్నారన్న సీఎం, భూనిర్వాసితులను మోసం చేసిన వెంకట్రామిరెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు గల్లంతు కావటం ఖాయమని ముఖ్యమంత్రి ఆరోపించారు.
"మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మల్లన్న, రంగానాయక సాగర్ వంటి ప్రాంతాల రైతులను మోసం చేసిన వ్యక్తి. ఈ ఎన్నికల్లో వెంకటరామిరెడ్డి తప్ప మీకు ఇంకో వ్యక్తి దొరకలేదా కేసీఆర్, హరీశ్‌రావు? ఎక్కడో కరీంనగర్ నుంచి తీసుకువచ్చి మెదక్ పార్లమెంట్‌కు నిలబెట్టారు. రైతుల భూములు గుంజుకుని కేసులు పెట్టిన వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసి, ఇక్కడ రైతాంగాన్ని మీరు అవమానించారు."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకు రాముడు గుర్తుకు వస్తాడని, దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలని సూచించారు. పోలింగ్ బూత్‌లో ఓట్ల కోసం దేవుడి పేరును వాడుకోవద్దని విమర్శించారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అడిగితే, మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని నిందించారు. తెలంగాణకు గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిన మోదీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు.
18వ లోక్‌సభ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య : నర్సాపూర్ సభ అనంతరం సరూర్‌నగర్ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్‌రెడ్డి, ప్రస్తుతం జరుగుతున్న 18వ లోక్‌సభ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్యగా అభివర్ణించారు. ఇండియా కూటమిని అధికారంలోకి తేవడానికి రాహుల్‌గాంధీ కృషి చేస్తున్నారని, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కిన రిజర్వేషన్లు కూడా ప్రమాదంలో పడ్డాయని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న మోదీ, అమిత్‌షాపై రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు.
తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు రాహుల్‌కు అండగా నిలిచి రిజర్వేషన్లను కాపాడుకోవాలని సీఎం కోరారు. 15 సెకన్ల సమయమిస్తే, మైనార్టీలను లేకుండా చేస్తామని బుధవారం రాష్ట్రానికి వచ్చిన ఓ బీజేపీ ఎంపీ మాట్లాడారని, అతనిపై ప్రధాని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత కలహాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో మత చిచ్చుపెట్టాలని చూస్తున్న కమలానికి, ఓటర్లు బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ పెడుతున్న మతచిచ్చు ఉచ్చులో మనం పడొద్దని వ్యాఖ్యానించారు.
"తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ ఉచ్చులో పడొద్దు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఎన్నికల అధికారులు కేసులు పెట్టాలి. కాషాయ పార్టీ తెలంగాణకు ఇచ్చింది, మోదీ తెచ్చింది ఏమీ లేదు. గాడిద గుడ్డు తప్ప. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి"-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వరంగ సంస్థల విక్రయం : రాహుల్ గాంధీ - lok sabha elections 2024