CM Revanth Reddy Participate in Congress Public Meeting : మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌజ్‌లో కట్టిన భవనం మూడేళ్లకే కూలిపోయేలా కట్టారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. ధర్నాచౌక్ వద్దన్న వాళ్లే ఇవాళ అక్కడ ధర్నా చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. సికింద్రాబాద్‌లోని ఎన్‌హెచ్-44పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం మహిళలతో చిట్‌చాట్ చేశారు. ఆ తర్వాత మాల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని మేడ్చల్‌లో జరిగిన ప్రజా దీవెన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల తరఫున పోరాడినందుకే నాకు పదవులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్‌కు అధికారం దక్కిందని తెలిపారు. తెలంగాణకు పట్టిన పీడ, చీడను వదిలించాలని పిలుపునిస్తే ప్రజలు కష్టపడ్డారని పేర్కొన్నారు. సంపూర్ణమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని కొందరు అంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము ఎవరికైనా ఉందా అంటూ ప్రశ్నించారు. పేదబిడ్డ సీఎం కుర్చీలో కూర్చుంటే కొందరికి కడుపు మండుతోందని ధ్వజమెత్తారు. దోచుకుని దాచుకున్న సొమ్ముతో ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
"ధర్నాచౌక్ వద్దన్న వాళ్లే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రతిపక్షాలకు స్వేచ్ఛ ఇవ్వాలని మా ప్రభుత్వం అనుమతిస్తేనే పోయి ఇందిరాపార్కులో ధర్నాలు చేసుకుంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తామని చెప్పుకునే బీజేపీ ప్రతి రాష్ట్రంలో పొత్తులు ఎందుకు పెట్టుకుంటుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మొత్తం అతుకుల బొంత." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
నేను గదిలో ప్రధానికి వినతిపత్రం ఇవ్వలేదు - నిండు సభలో అడిగాను : సీఎం రేవంత్
Congress Praja Deevena Sabha at Medchal : ధర్నాచౌక్(Dharna Chowk) వద్దన్న వాళ్లే ఇవాళ అక్కడ ధర్నా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే భయం పడ్డారన్నారు. పిల్లర్లు కుంగిన మేడిగడ్డ నుంచి నీళ్లు ఇవ్వాలని పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలినట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు అరవై ఏళ్లు పూర్తి అయినా చెక్కు చెదరలేదని హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ తన ఫామ్ హౌజ్(KCR Farm House)లో కట్టిన భవనం మూడేళ్లకే కూలిపోయేలా కట్టారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడున్న మెట్రో లైన్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందేనని చెప్పారు. పదేళ్లలో కొత్తగా ఒక్క కిలోమీటరు కూడా మెట్రో మార్గాన్ని పొడిగించలేదన్నారు. హైదరాబాద్ నాలుగు వైపులా ఒకేరకంగా అభివృద్ధి జరగాలని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ కారిడార్ ప్రారంభించిన సీఎం : ఈనెల 12న పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామని, మహిళలంతా విచ్చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 24 కోట్ల ప్రయాణాలు చేశారని తెలిపారు. 200 యూనిట్లలోపు వాడుకునే వారికి కరెంటు ఉచితంగా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇప్పటికే ప్రారంభించామన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడే వారికి నగర బహిష్కరణ : సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్‌లో ప్రతి గల్లీ అభివృద్ధి మా ప్రభుత్వం బాధ్యతే : సీఎం రేవంత్