CM Revanth on Telangana Lok Sabha Election Results 2024 : రాష్ట్రంలో వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చితే ఓటు వేయాలని లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను అడిగామని తెలిపారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలిచారని హర్షం వ్యక్తం చేశారు. వంద రోజుల పాలన తర్వాత 41 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయని వెల్లడించారు. అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువగా లోక్‌సభ ఎన్నికల్లో వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
'కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో మాకు 8 ఎంపీ సీట్లు గెలిపించి ప్రజలు ఆశీర్వదించారు. మా రెఫరెండాన్ని ప్రజలు సమర్థించారు. 8 ఎంపీ సీట్లు గెలిపించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. 2019లో 3 సీట్లు ఉంటే ఇప్పుడు ఆ మూడు కాస్త 8 ఎంపీ సీట్లుగా మారాయి.' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 7 సీట్లలో బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేశారని, బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన 22 ఓట్ల శాతాన్ని ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి బదిలీ చేశారని ధ్వజమెత్తారు. 2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో బీఆర్ఎస్కు మెజార్టీ వచ్చిందన్న రేవంత్ రెడ్డి, సిద్దిపేటలో బీఆర్ఎస్ ఓట్లను హరీశ్‌రావు బీజేపీకి బదిలీ చేయించారని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ ఓటింగ్ 16.5 శాతానికి పడిపోయిందన్నారు. అచేతనావస్థలో బీఆర్ఎస్ ఉందని, ఆ పార్టీకి మిగిలింది బూడిదే అంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న బీఆర్ఎస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు.
"వ్యవహార శైలిని కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మార్చుకోవాలి. పార్టీ మనుగడకు, కుటుంబ స్వార్థం కోసం చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారు. మోదీ కాలం చెల్లిందని ప్రజలు తీర్పు ఇచ్చారు. అందుకే ఈ ఎన్నికల్లో మోదీ గ్యారంటీని దేశ ప్రజలు తిరస్కరించారు. ప్రధాని పదవికి తక్షణమే మోదీ రాజీనామా చేయాలి. మూడోసారి కూడా మోదీ ప్రధాని పదవి చేపడితే విలువలతో కూడిన రాజకీయాలు చేయనట్లే. మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది." - రేవంత్ రెడ్డి, సీఎం
CM Revanth on Chandrababu Oath : తాను జిల్లాకు ముఖ్యమంత్రిని కాదని రాష్ట్రానికి సీఎం అని, తన బాధ్యత రాష్ట్రానికి పరిమితమని రేవంత్ అన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు ఓటములకు తానే బాధ్యుడినన్న రేవంత్, తన జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివని అభివర్ణించారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుంటామని తాను గతంలోనే చెప్పానన్న సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు.
"ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుంటాం. ఈ విషయం గతంలోనే నేను చెప్పాను. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చట్టపరంగా తేలిపోయింది. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు సంపూర్ణ రాజధాని. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్దతో కూడుకున్న హామీ. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడ్డామని రాహుల్ పునరుద్ఘాటించారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేసింది. అందుకే ఆ పార్టీని రామయ్య కూడా క్షమించలేదు. అయోధ్య ఆలయం కొలువై ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమే దీనికి నిదర్శనం" అని రేవంత్ అన్నారు.