Congress Leaders Meeting on Election Counting : ఓట్ల లెక్కింపు వేళ పాటించాల్సిన సూచనలపై కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.
CM Revanth Instructions to MP Candidates on Counting : మంగళవారం (జూన్ 4వ తేదీ)న జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌లో పాటించాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా చర్చించారు. కౌంటింగ్ ఏజెంట్ల అప్రమత్తతపై దిశానిర్దేశం చేశారు. ఓట్లె లెక్కింపు సమయంలో ఏజెంట్‌లు అధికారులతో వ్యవహరించాల్సిన తీరును నేతలకు వివరించారు. ఏజెంట్‌గా వెళ్తున్న ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా 17 సీ లిస్ట్(ఓటర్ల లిస్ట్) ఉండాలని చెప్పారు.
CM Revanth Reddy on Counting Instructions : హైదరాబాద్‌లో ఎంపీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నికల లెక్కింపు సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పోటా పోటీగా ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్న వారిని మాత్రమే ఏజెంట్‌గా పంపించాలని దిశానిర్దేశం చేశారు.
Telangana Lok Sabha Election Counting 2024 : సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోవాలని అన్నారు. ప్రతి రౌండ్లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ప్రతి ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్(ఓటరు జాబితా) ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ప్రతి అభ్యర్థి ఈ అంశాలపై అవగాహనతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో పాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. లోక్‌సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా జరగనున్న విషయం తెలిసిందే.