CM Revanth Election Campaign 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వం ఇవాళ్టితో ముగియనుంది. గడిచిన నెల రోజులుగా కాంగ్రెస్ ప్రచార సభలతో హోరెత్తిస్తోంది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో నిర్వహించిన జన జాతరతో ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్, నెల రోజులుగా ప్రచారాన్ని ఉద్ధృతంగా సాగించింది. నియోజకవర్గ ఇంఛార్జీల నేతృత్వంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ మేనిఫెస్టో అంశాలను ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నీతానై రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ 6 నుంచి ఇప్పటి వరకు 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్‌షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి సీఎం ప్రచార సభల్లో పాల్గొన్నారు.
CM Revanth Reddy Comments on BJP : బీఆర్ఎస్, బీజేపీల విమర్శలను తిప్పి కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఆయనకు ఉన్న క్రేజ్‌ను రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాల్లో ప్రచారానికి ఏఐసీసీ వాడుకుంది. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు. రాష్ట్రంలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, పక్కన పెట్టి కర్ణాటక, కేరళల్లో పర్యటించి అక్కడి బహిరంగ సభల్లో, రోడ్‌షోలలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌గాంధీ నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారంలో పాల్గొన్నారు. మధ్యలో వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి పత్రికలకు, ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
Revanth Reddy Campaign Guarantees : ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి జరగబోయే నష్టంపై రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి. కమలం పార్టీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. మోదీ, అమిత్ షాలు, ఇతర నాయకులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలకు దీటుగా రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. పదేళ్ల పాటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రానికి నిధులు కేటాయింపు, అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని విమర్శించారు.
Revanth Reddy Today Meeting : రాష్ట్రానికి బీజేపీ ‘‘గాడిద గుడ్డు" తప్ప ఏమిచ్చింది అనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆగస్టు 15లోపు తప్పనిసరిగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు భరోసా ఇచ్చిన అంశం చర్చకు దారితీసింది. ప్రచారంలో భాగంగా ఎంఐఎంపైనా రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించే మజ్లిస్‌కు ఓటు వేస్తారా? వ్యాపారాలు అభివృద్ధి చేసే హస్తం పార్టీకి ఓటు వేస్తారో ప్రజలు తేల్చుకోవాలని గోషామహల్ బేగంబజార్‌లో హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి సమీరుల్లాతో కలిసి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. నేటితో ప్రచార పర్వానికి తెరపడనుండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటించనున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పీసీసీ తెలిపింది.