CM Jagan Memantha Siddham Bus Yatra Failed : సీఎం జగన్ 'మేమంతా సిద్థం' బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లా పెరవలిలోకి ప్రవేశించే సమయంలో స్వాగతం పలికేందుకు పట్టుమని పది మంది కూడా లేరు. దారి పొడవునా పోలీసులు, ప్రత్యేక బలగాల హడావిడి మినహా ప్రజల నుంచి కనీస స్పందన కనిపించలేదు. రావులపాలెం, రాజమహేంద్రవరంలో జనం పర్వాలేదనిపించినా మిగిలినచోట్ల ప్రధాన కూడళ్లలో స్పందన లేదు. సీఎంకు స్వాగతం పలికేందుకు జనం రాకపోవడంతో బస్సులో నుంచే అభివాదం చేస్తూ ఆయన మందుకు వెళ్లిపోయారు. పెరవలి, ఖండవల్లి, ఈతకోట, గోపాలపురం, జొన్నాడ, చొప్పెళ్ల, మడికిలో అసలు ఎక్కడా జనం కనిపించలేదు.
జగన్ పర్యటనకు స్పందన కరవు : కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో జన సమీకరణకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తీవ్రంగా శ్రమించారు. ప్రజలకు డబ్బులిచ్చి మరీ బలవంతంగా తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది . మహిళలకు 200 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. వాహనాలతో ర్యాలీగా వచ్చిన వారికి పెట్రోలు కూపన్లు పంచిపెట్టారు. రావులపాలెంకు ఆటోల్లో జనాన్ని తెచ్చారు. కానీ సిద్ధం బస్సు రావులపాలెం వచ్చే సరికి ఎండ తీవ్రతకు తట్టుకోలేక జనం వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ నేతలు ఇచ్చిన కూపన్లతో బంకుల్లో పెట్రోల్ పోయించుకున్నా వారు బస్సు యాత్రకు రాకుండానే వెళ్లిపోయారు. ఇంత స్థాయిలో జన సమీకరణ చేసినా బస్సు చుట్టూ ఖాళీగానే కనిపించింది. పర్యటనకు స్పందన లేకపోవడంతో వైసీపీ నాయకులు కంగారుపడ్డారు. రాజమహేంద్రవరంలో ఒక్కొక్కరికి 300 చొప్పున ఇచ్చి ప్రధాన కూడళ్లకు జనాన్ని తరలించారు.
సీఎం జగన్కు జనం కరవు - వెలవెలబోతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర - CM jagan bus yatra
రావులపాలెంలో అరటి రైతులు తమ సమస్యలు చెప్పుకునేందుకు బస్సు నుంచి జగన్ కిందకు దిగుతారని ఎదురు చూశారు . కానీ ఆయన బస్సు దిగ లేదు. ఇద్దరు రైతులు బస్సులోకి రావాలని చెప్పి చివరకు బస్సు ఆపకుండా ముందుకు వెళ్లిపోయారు.
దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు : జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బస్సు యాత్రలోనూ అదే సీన్ రిపీటైంది. యాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కిలోమీటర్ల మేర ముందస్తుగా పోలీసులు, ప్రత్యేక పార్టీల బలగాలను మోహరించి ట్రాఫిక్ నిలువరించారు. మండే ఎండల్లో విసుక్కుంటూ జనం నిట్టూర్చాల్సి వచ్చింది. రాజమహేంద్రవరంలోని దేవీచౌక్, జాంపేట, గోకవరం బస్టాండ్, సీతంపేట, ఆర్యాపురం ప్రాంతాల్లో సీఎం వచ్చే బస్సు ఎత్తుకు అడ్డుతగులుతున్న చెట్ల కొమ్మలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. వాణిజ్య సముదాయాలు అధికంగా ఉన్నచోట విద్యుత్తు తీగలు కత్తిరించారు. ఇంటర్ నెట్ కేబుళ్లు తొలగించారు. 40 డిగ్రీలు దాటిన ఎండలకు విద్యుత్ కోతలు తోడవడంతో జనం ఉక్కపోతతో అల్లాడారు. తాడితోట, బైపాస్ రోడ్డు, చర్చిపేట , జాంపేట, అజాద్, గోకవరం బస్టాండ్, ఆర్యాపురం, కాతేరు ప్రాంతాల్లో బలవంతంగా దుకాణాలను మూసేయించారు.