CM Jagan Election Campaign in Palnadu District: రెండేళ్ల కిందట నరసరావుపేటలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ ఎన్నికల్లోపు ఆటోనగర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చి మెకానిక్‌లకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల కాలంలో శిలాఫలకాన్ని మాత్రమే ఆవిష్కరించారు. అదీ ఎన్నికలు సమీపిస్తున్నాయని హడావుడిగా మార్చి రెండోవారంలో కేసానుపల్లిలో కొబ్బరికాయ కొట్టారు.
స్థలం ఆటోనగర్ ఏర్పాటుకు అనువైనదో కాదో నిర్ధారించుకోకుండా, కార్మికులతో చర్చించకుండా కేటాయించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. రెండేళ్లయినా హామీ నెరవేరలేదు. ఎన్ఎస్సీ కాలనీలో స్థలం కేటాయించారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అధికారులతో ఎమ్మెల్యే గోపిరెడ్డి గతేడాది ఏప్రిల్ చివరిలో భూమిని పరిశీలించారు. 2023-24 విద్యా సంవత్సరం తరగతుల నిర్వహణకు, వసతి గృహానికి తాత్కాలిక భవనాల కింద జడ్పీ పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు గదులను, కస్తూర్భాలో నిర్మిస్తున్న గదులను, ఆయుర్వేద ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఇంతకు మించి కళాశాల ఏర్పాటులో పురోగతి ఏమీ లేదు.
మేం పార్టీ మారడం లేదు - అసత్య ప్రచారాలు ఆపండి: వీపీఆర్ - Vemireddy Prabhakar Reddy
కళాశాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై విద్యావేత్తలు, విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలోని ట్రాఫిక్ సమస్యని నియంత్రించేందుకు మల్లమ్మ సెంటర్ నుంచి గడియారం స్తంభం వరకు పై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దాని కోసం పట్టణంలోని అత్యంత విలువైన వాణిజ్య దుకాణాలను తొలగించి భూసేకరణ చేయాలన్న ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
వైసీపీ నాయకుల దుకాణాలే అధికంగా ఉండడంతో వారే ముందుకు రాలేదు. దీంతో పైవంతెన హామీని గాలికొదిలేశారు. గతేడాది జూన్ 12న పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో విద్యాకానుక కిట్లు పంపిణీ చేసిన తర్వాత సీఎం జగన్ కురించిన హామీల జల్లుతో అక్కడికొచ్చిన వారంతా తడిసి మద్దయ్యారు. కానీ నేటికీ ఒక్కటీ కూడా అమలు కాలేదు.
ముందుగా 7 కోట్ల రూపాయలతో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల భవనం, మాదిపాడు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వినతి మేరకు సాగు, తాగు, విద్యుత్‌కు సంబంధించి పలు హామీలు ఇచ్చారు. అయితే తొమ్మిది నెలలు గడిచినా కృష్ణానదిపై వంతెన టెండర్ల దశ దాటలేదు.
అచ్చంపేట మండలం తాళ్లచెరువు పరిధిలో 45కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం పరిశీలన దశ దాటలేదు. మాదిపాడు నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు తారు రోడ్డు నిర్మాణం పనులు నెల రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. అచ్చంపేట మండలం రోకటిగుంటవారిపాలెం వద్ద 132/11 KV విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి భూసేకరణ దశ దాటలేదు.
క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో 132 KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి కాలేదు. పులిచింతల ముంపు గ్రామాల్లో ఒకటైన ఎమ్మాజీగూడెం వాసుల సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అనేక సార్లు వరద తీవ్రత వల్ల 129 కుటుంబాలు ఇళ్లు, పంట పోలాలు, పశువులను నష్టపోయాయి. వన్‌టైమ్ సెటిల్‌మెంట్, పునరావసంతో పాటు తమ బిడ్డల భవిష్యత్తుకు దారి చూపించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
గతేడాది నవంబర్ 15న మాచర్లలో వరికపూడిశెల ప్రాజెక్టు శంకుస్థాపనుకు వచ్చిన సీఎం జగన్ వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు అది పట్టాలెక్కలేదు. 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ పిడుగురాళ్లలో రైతులకు సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని హామీలు గుప్పించారు.
గత ఐదేళ్లలో సాగునీటికి సంబంధించి ఒక్క ప్రాజెక్టూ నిర్మించలేదు. కనీసం కాలువల మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతో జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు అందించే పథకం పనులు మాత్రమే సాగుతున్నాయి.
ఏడాది క్రితం వినుకొండలో పర్యటించిన సీఎం జగన్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి హామీలిచ్చారు. వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు 15కోట్ల రుపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆసుపత్రి స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో విడుదల కాలేదు.
ఇప్పుడున్న ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మైనార్టీ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల మంజూరు చేస్తూ 10 కోట్లు ఇస్తున్నానని వెల్లడించారు. మొదట్లో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారులు స్థల పరిశీలన పేరుతో వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కళాశాల మంజూరుపై ఎటువంటి జీవో విడుదల కాలేదు.
బొల్లాపల్లి మండలంలోని 20 గ్రామాలకు తాగు నీరందించేందుకు 12కోట్ల రూపాయలతో సామాజిక రక్షిత తాగునీటి పథకం మంజూరు చేస్తున్నానని గొప్పగా ప్రకటించారు. మూగ చింతలపాలెం వద్ద కుడి ప్రధాన కాలువ డీప్‌కట్ నుంచి బొల్లాపల్లి చెరువుకు నీటిని పంపింగ్ చేసి కుళాయి నీరు అందిస్తామన్నారు.
గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులు సర్వే చేసి అంచనాలు తయారు చేసి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలో ఎటువంటి కదలిక లేదని సంబంధిత అధికారులు తెలిపారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం జగన్ నియోజకవర్గ అభివృద్ధికి హామీల జల్లు కురిపించారు. కానీ వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు.
అమృత్ పథకం కింద తాగునీటికి సంబంధించి మిగిలినపోయిన పనులు పూర్తి చేసేందుకు 60 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానన్న హామీ నీటి మూటగానే మిగిలింది. నకరికల్లు వద్ద జీబీసీ నుంచి పట్టణ తాగునీటి చెరువు వరకు పైపులైన్ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. దీంతో పట్టణ వాసులకు రెండు రోజులకు ఒకసారి తాగునీరు అందించాల్సిన దుస్థితి నెలకొంది.
2019 ఎన్నికల ముందు కళామందిర్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో తుర్లపాడు, పసుమర్రు మేజర్ కాల్వలు పొడిగించి చిలకలూరిపేట చివరి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. దీనికి సంబంధించి అయిదేళ్లలో అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికీ ఈ ప్రాంత వాసులు చాలాచోట్ల వాగుల మీద ఆధారపడి బతుకుతున్నారు.
చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద వీకర్స్ కాలనైజేషన్ సొసైటీ ఎస్సీ, ఎస్టీలకు 4 దశాబ్దాల క్రితం 420 ఎకరాలు ఏక పట్టాగా సాగు చేసుకునేందుకు భూములిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే అందులో గ్రానైట్ నిక్షేపాలు ఉండటంతో పాలకులు, స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా రైతులను మభ్యపెట్టి ఏపీఎండీసీ ద్వారా ఎకరాకు 8లక్షలు చెల్లించి భూములను దక్కించుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. దానికి సహకరించారనే స్థానిక ప్రజాప్రతినిధికి మంత్రి పదవి బహుమతి ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి.