CM Chandrababu Want People Not Bowing to Leaders Feet Culture: రాష్ట్రంలో నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే, తానూ వారి కాళ్లకు దండం పెడతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని సీఎం వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా చిట్‌చాట్‌లో ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.
తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకే ఎవరైనా నమస్కారం పెట్టాలి తప్ప నాయకులకు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల కాళ్లకు నమస్కరించి ఎవ్వరూ తమ గౌరవాన్ని తగించుకోవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టకూడదనే విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అనంతరం కార్యకర్తలు, ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు.
రోడ్డుపై కాన్వాయ్ ఆపిన సీఎం- ఆప్యాయంగా పలకరించి, వినతులు స్వీకరించిన చంద్రబాబు - CM Chandrababu
పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం: అధికారంలోకి వచ్చేశాం అనే అలసత్వం వీడాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులూ పార్టీ కార్యాలయానికి తరచూ రావటం సేవగా భావించాలన్నారు. రోజూ ఇద్దరు మంత్రులైనా వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్టీఆర్ భవన్లో ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రుల్ని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇంఛార్జిలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు మంత్రులంతా బాధ్యత తీసుకోవాలన్నారు.
మాట నిలబెట్టుకున్న చంద్రబాబు - పేద దంపతులకు ఇల్లు మంజూరు - Chandrababu Kept His Promise
కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు, విజ్ఞాపనల స్వీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. పార్టీ నేతలు ఎవ్వరూ వ్యక్తిగత దాడులకు, కక్షసాధింపులకు దిగొద్దన్న చంద్రబాబు వైఎస్సార్సీపీ చేసిన తప్పులే తిరిగి మనం చేస్తే వారికీ మనకూ తేడా ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామన్నారు. గత ఐదు ఏళ్లుగా పార్టీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులను చంద్రబాబు ఆరా తీశారు. చట్టపరంగానే కేసుల నుంచి విముక్తి కలిగించాలనే విషయంపై చంద్రబాబు నేతలతో చర్చించారు.
పార్టీ కోసం కష్టపడిన వారి సమాచార సేకరణ: నియోజకవర్గ ఇంఛార్జిలు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని సీఎం కోరారు. తెలుగుదేశం నేతలు, ఇళ్లు, కార్యాలయాలపై గతంలో వైఎస్సార్సీపీ మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని అధికారుల వివరాలూ ఇవ్వాలని ఆదేశించారు. సమర్థులందరికీ నామినేటడ్ పదవులు దక్కుతాయన్న చంద్రబాబు పార్టీ కోసం కష్టపడిన వారి గురించి 5 విధాలుగా సమాచార సేకరణ చేస్తున్నామన్నారు. నివేదికలు త్వరగా పంపాలని నేతలను ఆదేశించారు.