Chilakaluripet Modi Public Meeting Arrangements: ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరగనున్న ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మురంగా సాగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు సమన్వయంతో సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిలకలూరిపేట బహిరంగ సభకు 'ప్రజాగళం' పేరు ఖరారు చేశారు. ఆదివారం మధ్యాహ్నం టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో ఈ సభను నిర్వహించనున్నారు.
ప్రధాని మోదీ పాల్గొనే సభను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభా ప్రాంగణం 140 ఎకరాలు కాగా, పార్కింగ్‌కి 60 ఎకరాలు కేటాయించారు. ఈ సభకు 10 లక్షల పైచిలుకు బీజేపీ-టీడీపీ-జనసేన తరపున కార్యకర్తలు హాజరవుతారని సమాచారం. 'ప్రజాగళం' పేరుతో సభ నిర్వహణకు మూడు పార్టీల నిర్ణయం తీసుకున్నాయి. ఈ సభ ద్వారా నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు.
అందరి చూపు చిలకలూరిపేటవైపే - టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సభకు భారీ ఏర్పాట్లు
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తొలిసభను సమన్వయంతో విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని టీడీపీ నేతలు అన్నారు. 2014 నాటి రాజకీయ ఎన్నికల ముఖ చిత్రం ఈ నెల 17న తిరిగి ఆవిష్కృతం కానుందని జనసేన నేతలు పేర్కొన్నారు.
నవ్యాంధ్ర భవిష్యత్‌కు దశ- దిశ చూపే విధంగా ఎన్డీఏ కూటమి సభ దద్ధరిల్లాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లరావు అన్నారు. ఈ నెల 17న పల్నాడు జిల్లా బొప్పూడిలో నిర్వహిస్తున్న మూడు పార్టీల ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించి పార్టీ శ్రేణులతో కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. సిద్ధం సభలతో గ్రాఫిక్స్ చూపించిన జగన్‌కు కలలో సైతం బొప్పూడిలో జరిగే ఉమ్మడి సభ కనిపించాలన్నారు. సభ విజయవంతం కావడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.