Chandrababu Pawan Kalyan Tweets: టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి ప్రకటన, కూటమి మధ్య సీట్ల పంపకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎక్స్ వేదికగా స్పందించారు. కూటమి మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఆశీర్వదించాలని కోరారు. ఈ మహత్తరమైన ముందడుగుతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునే దశకు చేరుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిపై ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే సీట్ల పంపకం జరిగిందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. సీట్ల సంఖ్య, హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని తెలిపారు. అదే ఉద్దేశంతో మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని వెల్లడించారు. కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి బలమైన పునాదిపడిందన్న పవన్, ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఎన్డీఏ భాగస్వాములుగా ఏపీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటామని వివరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలసి పని చేస్తాయన్నారు. అదే విధంగా చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాలకు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు.
17న చిలకలూరిపేటలో 3 పార్టీల తొలి బహిరంగ సభ - పాల్గొననున్న ప్రధాని మోదీ
సీట్ల సర్దుబాటు ఇలా: పొత్తులలో భాగంగా టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల వ్యవహారం కొలిక్కి వచ్చింది. పొత్తుల్లో భాగంగా బీజేపీ-జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు. మొత్తం 31 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాల్లో బీజేపీ-జనసేన పోటీ చేయనున్నాయి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 8 ఎంపీ సీట్లు కేటాయించగా ఇందులో 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. అదే విధంగా 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది.
ముందుగా 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు ఒప్పందం కుదిరగా, తమ కోటాలో నుంచి బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు జనసేన ఇచ్చింది. అదే విధంగా తమ కోటా నుంచి అదనంగా ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి టీడీపీ ఇచ్చింది. ఈ మేరకు సీట్ల సర్దుబాటు పూర్తైనట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ట్వీట్ చేశారు.
కొలిక్కివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు - సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటన
బీజేపీ, జనసేన పోటీ చేయనున్న స్థానాలు ఇవే: ఇకపోతే అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీచేయనుంది. ఇందులో రాజమహేంద్రవరం నుంచి పురందేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. నేడు రెండో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి ఒకరిద్దరి పేర్లు కూడా జాబితాలో ఉండే అవకాశం ఉంది.
అదే విధంగా ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. మరోవైపు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో జనసేన పోటీచేయనుంది. సీట్ల సర్దుబాటు ఖరారు కావడంతో తెలుగుదేశం పార్టీ ఈనెల 14న రెండో జాబితాను ప్రకటించనుంది. అదే రోజు లోక్‌సభ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు నాలో మంచితనం చూశావు జగన్, ఇప్పటినుంచి యుద్ధం ఇస్తా: పవన్ కల్యాణ్