Chandrababu 30 Years as CM : ఒకటికాదు రెండుకాదు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి 30 ఏళ్లవుతున్నా ఆలోచనల్లో జోష్ తగ్గలేదు. వినూత్న నిర్ణయాల్లో వేగం మందగించలేదు. పోరాట యోధుడిలా చంద్రబాబు అలు పెరగని రాజకీయ యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. నాలుగున్నర దశాబ్దాలు దాటిన ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నెన్నో మైలురాళ్లు మరెన్నో ఉత్థాన, పతనాలు! అయినా ఇప్పటికీ అదే తరగని ఉత్సాహం!
నాలుగోసారి సీఎంగా పాలనా పగ్గాలు : ఎక్కడో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిన్న గ్రామం నారావారిపల్లెలో సాధారణ రైతు కుటుంబంలో చంద్రబాబు జన్మించారు. అసాధారణ నాయకత్వ లక్షణాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ, కఠోరశ్రమతో రాష్ట్ర, దేశ రాజకీయాల్నే మలుపు తిప్పే స్థాయికి ఎదిగారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికాలం సీఎంగా పనిచేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. ఇప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఆయన ఇటీవల ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి నాలుగోసారి సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టారు.
Chandrababu Turns 30 Years : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రవేశపెట్టిన వినూత్న, విప్లవాత్మక విధానాలు, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతాయి! సమాజ గతిని మార్చేందుకు, లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు, జీవితంపై భరోసానిచ్చేందుకు అవి దోహదం చేశాయి. 1978లో చంద్రగిరి నియోజక వర్గం నుంచి ఆయన తొలి విజయం అందుకున్నారు. 1980లో పురావస్తుశాఖ, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంరక్షణ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలకు మంత్రిగా సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వహించారు.
చంద్రబాబు పాత్రే ప్రధానం : ఎన్టీఆర్ కోరికపై 1983 చివరలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ్నుంచి రాజకీయ జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. 1984లో టీడీపీ ప్రభుత్వం సంక్షోభ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి రంగప్రవేశం చేశారు. ఆయన వ్యూహరచనతో, రాజకీయ చతురతతో నిర్వహించిన పాత్ర అమోఘం. 1994లో అధికారంలోకి రావటానికి చంద్రబాబు పాత్రే ప్రధానమైనది. పార్టీలో బయటి వ్యక్తుల ప్రమేయం అవ్వటం వల్ల గెలిచిన 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబర్ 1న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రారంభించారు. 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. సాంకేతికాభివృద్ధిని అర్ధం చేసుకొని 1998లో హైటెక్ సిటీని ప్రారంభించారు. అనతి కాలంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయిలో గురింపు తెచ్చారు. అందుకే తిరుగులేని మెజార్టీతో రెండోసారి పార్టీని అధికారంలోకి తెచ్చారు.
అపరచాణక్యుడని పేరు : రాజకీయ రంగంలో చంద్రబాబుకు అపరచాణక్యుడని పేరుంది. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగేలా తెలుగుదేశం ఎదుగుదల వెనుక ఆనాటి నేషనల్ ఫ్రంట్ వెనుక ఆయన కీలకపాత్ర పోషించారు. రెండుసార్లు ప్రధానమంత్రుల నియామకంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం నియామకంలోనూ ముఖ్య భూమిక వహించారు.
అది చంద్రబాబు చలవే! : పరిపాలనలో సాంకేతికతను జొప్పించేందుకు, ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి, పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేశారు. ఒక సీఎంలా కాకుండా ఏదో కార్పొరేట్ సంస్థకు అధినేతలా ఆయన పడిన శ్రమ చేసిన కృషి చూసిన వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు ఆయణ్ని ఆంధ్రప్రదేశ్‌కి సీఈఓగా కొనియాడేవారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పల్లె నుంచీ దేశ, విదేశాల్లో ఐటీరంగంలో స్థిరపడిన పిల్లలు కనీసం నలుగురైదుగురన్నా ఉన్నారంటే అది చంద్రబాబు చలవే!
రాజకీయ నాయకుల్లో ఐటీ జ్ఞానిగా, ఈ-గవర్నెన్స్‌ను ప్రజలకు పరిచయం చేసిన దార్శనికుడిగా చంద్రబాబుకు పేరుంది. 1995-2004 మే వరకు రాష్ట్ర ,జాతీయ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. 2004 ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినా 2009లో మళ్లీ అధికారంలోకి రాలేకపోయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా నాయకుల్లో,కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపారు. అనేక సమస్యలపై గల్లీ నుంచి దిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం వరకు అలుపెరగని పోరాటం చేశారు. అన్నదాత కోసం నిరాహారదీక్ష చేపట్టి 8 రోజులపాటు అన్నం మానేసిన నాయకుడు చంద్రబాబు. ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం 208 రోజులు 2,817 కి.మీ ప్రజల కోసం పాదయాత్ర చేశారు.
కొత్త తరహా పాలనను పరిచయం : ముఖ్యమంత్రి అంటే ఏసీ గదుల్లో కూర్చుని ఆదేశాలిస్తే సరిపోదని ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వారి పక్కనే అండగా ఉంటేనే సత్వర సాయం అందుతుందని చంద్రబాబు భావించారు. 1996లో కోనసీమ తుపాను, ఆ తర్వాత విశాఖ, ఉత్తరాంధ్రలను హుద్‌హుద్, తిత్లీ వంటి తుపానులు అతలాకుతలం చేసిన సందర్భాల్లో ఆయన నిరూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు.
శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు, రైతు బజార్లు వంటి అనేక కార్యక్రమాలు చంద్రబాబు చేపట్టారు. ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. డ్వాక్రా సంఘాల విజయగాథలు తెలుసుకోవడానికి దేశ, విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
నవ్యాంధ్రను మళ్లీ గాడిలో పెట్టే బాధ్యత : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి విజన్-2020 తయారు చేసి దార్శనిక నేతగా పేరుగాంచారు. 2014లో రాజధాని లేని నవ్యాంధ్రకు సీఎంగా బాధ్యతలు చేపట్టాక అతి త్వరలోనే పరిస్థితుల్ని గాడిలో పెట్టారు. అమరావతి నిర్మాణానికి నడుంకట్టారు. కియా వంటి అనేక పరిశ్రమల్ని ఏపీకి తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, ఆదరణ, చేయూత ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇటీవల ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అన్నిరంగాల్లో దివాళా తీసిన నవ్యాంధ్రను మళ్లీ గాడిలో పెట్టే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు.