Chandrababu Naidu Phone to Party Leaders : సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకుని కలిసి పని చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ నేతలు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో అధినేత వరుసగా చర్చిస్తున్నారు. సీట్ల ప్రకటన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై నేతలతో ఆయన మాట్లాడారు. 12 నియోజకవర్గాల్లో నేతలతో స్వయంగా మాట్లాడి ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చారు. యర్రగొండపాలెంలో పార్టీ నేతలు మన్నె రవీంద్ర, ఎరిక్సన్ బాబుతో మాట్లాడిన చంద్రబాబు ఇద్దరు నేతలు కలిసి పని చేయాలని సూచించారు. పార్వతీపురం నియోజకవర్గ నేతలు విజయ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌తో మాట్లాడి కలిసి పని చేయాలని విజయ్ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.
ఎన్డీఏలోకి చంద్రబాబు- ఏపీలో టీడీపీ,జనసేన కూటమితో జట్టుకట్టిన బీజేపీ
నంద్యాలలో ఫరూక్ కు సహకరించాలని బ్రహ్మానంద రెడ్డికి స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం (Kalyana Durgam) లో సీటు దక్కించుకున్న సురేంద్ర బాబుకు పూర్తి సహకారం అందించాలని ఉమా మహేశ్వర నాయుడు, హనుమంత రాయ చౌదరీలకు చంద్రబాబు సూచించారు. కురుపాం నేత దత్తి లక్ష్మణ రావుతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు పార్టీ అభ్యర్థి తోయక జగదీశ్వరి గెలుపునకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శిగా లక్ష్మణ రావును నియమించారు. చిత్తూరు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్యే ఎఎస్ మనోహర్ తో మాట్లాడిన చంద్రబాబు పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ఉంగుటూరు ఇంచార్జ్ గన్ని వీరాంజనేయులు, పిఠాపురం వర్మ, పోలవరం బొరగం శ్రీనివాస్, నర్సాపురం పొత్తూరి రామరాజు, కాకినాడ రూరల్ (kakinada Rural)లో పిల్లి సత్యనారాయణ మూర్తి, తాడేపల్లిగూడెం వలవల బాబ్జీతో మాట్లాడారు. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు పని చేయాలని నేతలకు వివరించారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికి పార్టీ న్యాయం చేస్తుందని నేతలకు హామీ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు మాట్లాడడంతో పార్టీ కోసం పని చేస్తామని నేతలు ఆయనకు తెలిపారు.
బీసీల దశ, దిశ మార్చడం కోసమే 'బీసీ డిక్లరేషన్': చంద్రబాబు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదని, సమాజ శక్తిలో సగం అని తెలిపారు. మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబన (Financial self-reliance)కు నిరంతరం పని చేసింది టీడీపీ అని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో తెలుగుదేశం పార్టీ వెలుగులు నింపిందని, ప్రత్యేకంగా మహిళలకు 22 సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిందని పేర్కొన్నారు. నేడు మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు మహాశక్తి పథకం (Mahashakti scheme) ప్రకటించామన్నారు.
ఏపీ భవిత కోసమే ఉమ్మడి ప్రయాణం - ఈ నెల 17న టీడీపీ-జనసేన మేనిఫెస్టో
ఈ పథకం కింద చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేల చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదన్న ఆశయంతో 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. కలలకు రెక్కలు పథకంలో పేరు నమోదు కోసం kalalakurekkalu.com వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.
దిల్లీలో చంద్రబాబు, పవన్ - అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు - ఎన్డీఏలోకి టీడీపీ!