Police Case Filed Against AP EX CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్ పి.వి.సునీల్ కుమార్‌పై కేసు నమోదయ్యింది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజును గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాహత్నం చేశారని ఫిర్యాదు చేశారు. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జగన్ అధికారం కోల్పోయాక నమోదైన తొలి కేసు ఇది.
లాఠీలతో కొట్టారు : 2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్‌ను A3గా పోలీసులు పేర్కొన్నారు. A1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.
తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నం : 2021 మే 14 జరిగిన ఘటనపై రఘురామరాజు గురువారం ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నం చేశారని, ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని కొట్టారని ఆరోపించారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదులో చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని తెలిపారు. జగన్‌ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ బెదిరించారని తెలిపారు.
తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదు : తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, ఐదుగురు ఆగంతుకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఎంతటివారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదనేది రుజువవుతుందని తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే ? : 2021 మే 14న సుమారు సాయంత్రం 4 గంటల సమయంలో అప్పటి వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించారని సీఐడీ అభియోగం మోపింది. రఘురామ భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చింది. రఘురామను పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించి సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అర్ధరాత్రి వరకూ సీఐడీ అధికారులు విచారించారు. రఘురామకృష్ణరాజు అరెస్టుపై హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అదేరోజు అర్ధరాత్రి వరకూ ఎంపీ రఘురామను సీఐడీ అధికారులు విచారించారు.
ఆ తర్వాత రోజు అంటే 2021 మే 15న సీఐడీ కార్యాలయంలోనే రఘురామకృష్ణరాజుకి గుంటూరులో జీజీహెచ్ వైద్య బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలోనే హైకోర్టు రఘురామ తరపున దాఖలైన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని రఘురామకు హైకోర్టు సూచించింది. ఆ తర్వాత ట్రయల్స్ కోర్టులో జడ్జి ముందు రఘురామకృష్ణరాజుని పోలీసులు హాజరు పరిచారు. పోలీసులు తనను కొట్టారని జడ్జికి గాయాలు చూపి రఘురామ రాతపూర్వక ఫిర్యాదు చేశారు. రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై కోర్టు నివేదిక కోరింది. గుంటూరు జీజీహెచ్, రమేశ్ ఆస్పత్రుల్లో మెడికల్ ఎగ్జామినేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీని కొట్టిన సంగతి, కమిలిపోయిన గాయాలకు సంబంధించిన ఫొటోలతో న్యాయవాది ఆదినారాయణరావు హైకోర్టుకు లేఖ రాశారు.
2021 మే 17న రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి ఎంపీ రఘురామను తరలించారు. 18న ఎంపీ రఘురామకు సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేశారు. 19న ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మే 21న వాడీవేడి వాదనల అనంతరం రఘురామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.