KTR Raised Questions on Congress : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది, అమరవీరుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల? అని నిలదీశారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లేనని ఆయన పేర్కొన్నారు. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది, 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరని కేటీఆర్ అడిగారు.
KTR Fires on Congress : 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లలో 11 స్థానాల్లో తెలంగాణ ప్రజా సమితి పార్టీని గెలిపిస్తే, ఆ పార్టీని మాయం చేసింది ఎవరని, దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరి వల్లని కేటీఆర్ ప్రశ్నించారు. 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు? అని అన్నారు. వీటన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే సమాధానంగా ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలి దేవత ఎవరని ప్రశ్నించిన కేటీఆర్, ఆ సమాధానాన్ని మాత్రం ఖాళీగా వదిలారు.
KTR Slams Govt Over Telangana Emblem Change : ఇదిలా ఉండగా తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులపై కేటీఆర్ ఇటీవల స్పందించారు. ఇందులో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారనే ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ఇప్పుడు వాటిని తీసివేయాల్సిన అత్యవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, ముఖ్యమంత్రికి రాష్ట్ర చరిత్ర గురించి తెలియదని కేటీఆర్ విమర్శించారు.
అధికారిక చిహ్నంలో అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదని కేటీఆర్ అన్నారు. కానీ ఇప్పటికే ఉన్న వాటిని తొలగించవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు.