KTR Slams Govt Over Telangana Emblem Change : తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిహ్నంలో మార్పులు చేర్పులపై కసరత్తులు జరుగుతున్నాయి. ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా దీనిని రూపొందిస్తున్నారు. అయితే ఇందులో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు నేతలు చార్మినార్‌లో పర్యటించారు. ప్రజల బతుకులు మార్చమని అధికారం ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తూ రాక్షసానందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న మూర్ఖపు ధోరణితో వ్యవహరించడం తగదని, పదేళ్లతో జరిగిన మంచి, అభివృద్ధిని పట్టించుకోకుండా రాజకీయ దుగ్ధ, కక్షతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.
'అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖత్వం. ఇప్పుడు వాటిని తీసివేయాల్సిన అత్యవసరం ఏమొచ్చింది?. రేవంత్‌రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర గురించి తెలియదు. హైదరాబాద్ ఐకాన్‌గా చార్మినార్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. అలాంటి చార్మినార్‌ను తొలగించడమంటే ప్రతి ఒక్కరినీ అగౌరవపరిచినట్లేనని' కేటీఆర్ వ్యాఖ్యానించారు.
"కాకతీయ కళాతోరణాన్ని ఎన్టీఆర్ ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చార్మినార్ 400 ఏళ్ల ఉత్సవాలను కూడా నిర్వహించింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతాం. అమరవీరుల స్థూపం గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడడమంటే హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉంటుంది. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదు. ఇప్పటికే ఉన్న వాటిని తొలగించవద్దని కోరుతున్నాం." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
KTR Slams TG Govt Remove Charminar from State Logo : రాష్ట్ర అధికారిక చిహ్నంపై మార్పులపై కేటీఆర్ స్పందించారు. చార్మినార్ దశాబ్దాల తరబడి హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని కేటీఆర్ అన్నారు. నగరం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్న చార్మినార్ గురించి ఆలోచించకుండా ఉండలేరని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని భావిస్తోందని ఆరోపించారు. మరోవైపు కాకతీయ కళాతోరణం తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వరంగల్లో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ ఫొటోను కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన అన్నారు.
అధికారిక చిహ్నం మార్పులపై బీఆర్ఎస్ ధర్నా : అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారనే ప్రచారంపై వరంగల్ కోటలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. వీటిని తొలగించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కారణాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. దీనిని తొలగిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీ సర్కార్‌పై ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో, నిరసనకు అనుమతి లేదని బీఆర్‌ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తుది దశకు చేరుకున్న జయ జయహే తెలంగాణ గీతం, చిహ్నం - CM Revanth to Review Telangana Song