KTR Rajanna Siricilla Visit : దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారి తెలంగాణలో మకుటాయమానంగా రాష్ట్ర సెక్రటేరియట్‌కు డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ఆయనకు ఘన నివాళి అర్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన, ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 76 సంవత్సరాల భారతదేశ స్వాతంత్య్రంలో దళితులను కూడా ధనికులను చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.
"ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చింది. ఆ హామీల్లో ప్రధానంగా మా పార్టీ దళిత బంధుకు సంబంధించి రాష్ట్రంలో 18% ఉన్న దళిత జాతికి చేయూతగా రూ.10 లక్షలు ఇస్తుంటే, మీరు రూ.12 లక్షలు ఇస్తామంటూ అంబేద్కర్ అభయహస్తం పేరిట స్కీం తెస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ పథకాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలానే రాబోయే బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఈ అంబేద్కర్ అభయహస్తానికి తగు మొత్తంలో నిధులు కేటాయించి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలి."-కేటీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే
KTR on Ambedkar Abhayahastam Funds : దళిత బంధు ద్వారా దళితులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు కంటే మించిన పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అంబేద్కర్ అభయ హస్తం ద్వారా దళితులకు రూ.12 లక్షలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని అన్నారు.
అనంతరం సిరిసిల్ల పట్టణంలోని సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గ అభినందన సభకు కేటీఆర్ హాజరై నూతనంగా ఎన్నికైన బ్యాంకు డైరెక్టర్లను అభినందించారు. రాష్ట్రంలో 47 సహకార బ్యాంకులు ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ బ్యాంక్ రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. అందరూ పాత బకాయిలు చెల్లించి బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఆయన కోరారు.