KTR On Sircilla Handloom Workers Problems : కాంగ్రెస్ పాలనలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన, బీఆర్ఎస్ హయాంలో నేత కార్మికులను కాపాడుకున్నామని తెలిపారు. ఉపాధి కల్పనతో నేతన్నల ఆత్మహత్యలు, తగ్గాయని గుర్తుచేశారు. కేసీఆర్ కిట్లు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, బతుకమ్మ చీరల ద్వారా రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారని మండిపడ్డారు. తిరిగి నేత కార్మికులకు చీరల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లను మరో తిరుప్పూరు చేయడానికి కృషి చేశామన్న ఆయన, బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దానిపై విచారణ చేయాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్లు గుర్తు చేశారు. సిరిసిల్ల నేతన్నల తరఫున పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్, తమ పోరాటానికి నేతన్నలు కూడా సహకరించాలని కోరారు.
"కోటిమంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచి తయారుచేసి ఇక్కడ పరిశ్రమలో పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి ఒక సంవత్సరానికి ఏడెనిమిది నెలలు ఏ ఢోకా లేకుండా పూర్తిగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వేలాది కార్మికులకు కడుపునింపిన మహానుభావుడు కేసీఆర్. వరుసగా తొమ్మిదన్నర సంవత్సరాలు పాటు ప్రభుత్వం ఉంటే, ఏడెనిమిదేళ్లు ఈ బతుకమ్మ చీరల ద్వారా రూ.3,312 కోట్ల ఆర్డర్లు సిరిసిల్లకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఈ జిల్లాలో ఆత్మహత్యలు బంద్ అయి జీతాలు డబులై రూ.8 వేల సంపాదించే నుంచి రూ.20 వేలుకు ఎదిగి ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న ఈ సమయంలో మొత్తం ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసింది."-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కక్షరాజకీయాలకు స్వస్తి పలికి ప్రజాపాలనపై దృష్టి పెట్టండి : కాంగ్రెస్ సర్కార్ రాజకీయంగా తన మీద కోపంతో రాజన్న సిరిసిల్ల ప్రజలు, నేతన్నల మీద పగబట్టినట్లు కక్ష తీర్చుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు. పగ సాధించుకోవాలంటే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. తొమ్మిది నెలల నుంచి ఎంతసేపు రోజుకో పుకారు పుట్టించాలన్న ధ్యాస, హెడ్లైన్ - డెడ్లైన్ మేనేజ్మెంట్ అన్న విధానమే తప్ప ప్రజలకు చేసిన మేలు ఏంటని ప్రశ్నించారు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన హామీలకు ఏ దిక్కులేదని ధ్వజమెత్తారు. ఇకనైనా కక్షరాజకీయాలకు స్వస్తి పలికి ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.
ఫార్మా సిటీ రద్దు వెనక రూ.వేల కోట్ల భూ కుంభకోణం : ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి, తన సోదరులకు వేల కోట్లు లబ్ధి చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపణలు చేశారు. ఫార్మాసిటీ కొనసాగుతుందంటూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చిందని, రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ చాలా సందర్భంగా ప్రకటించారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూమిని వారికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
ఫ్యూచర్ సిటీ, ఏఐ సీటీ, ఫోర్త్ సిటీ అంటున్న ప్రభుత్వం.. దాని కోసం ఒక్క ఎకరం భూమినైనా సేకరించిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క ఎకరాం సేకరించకుండా ఫార్మా సిటీ భూములను ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తారన్నారు. ఫార్మా సిటీ వెనక వేల కోట్ల భూ కుంభకోణం ఉందని, అన్ని వివరాలను త్వరలోనే బయటపెడతానన్నారు. 14 వేల ఎకరాల్లో, రూ.64 వేల కోట్ల పెట్టుబడులతో ఫార్మాసిటీని తాము ప్రతిపాదించామని అందుకోసం నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఆ భూములను ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం లేదన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను ఇతర అవసరాల కోసం మళ్లించి వేల కోట్ల రూపాయల కుంభకోణం చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఫార్మాసిటీ ఉంటే 14 వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని, లేదంటే రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
డెడ్ లైన్ సమీపిస్తున్నా - ఈ డైలమాకు తెరదించేదెప్పుడు? : కేటీఆర్ - KTR Tweet on MBBS Admissions