BRS Situation at Station Ghanpur : లోక్‌సభ ఎన్నికల వేళ కీలక నాయకుల వలసలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారాన్ని కోల్పోయి నాలుగు నెలలు కూడా గడవక ముందే కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి వరుస కడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా వివిధ స్థాయిలోని వారు కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు గులాబీ కండువాను పక్కకు పెట్టగా, ఇంకా కొంత మంది పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
Kadiyam Srihari Joined Congress : తాజా పరిణామాలన్నీ బీఆర్ఎస్ హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారాయి. అసలే అధికారం కోల్పోవడంతో పాటు ఇతర సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, నేతల వలసలు మరింత ఇక్కట్లలోకి నెట్టాయి. తాజాగా ఆదివారం నాడు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Join Congress) గులాబీ పార్టీ వీడి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో పార్టీని నడిపించే నేత ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని హస్తం పార్టీ కైవసం చేసుకోగా, స్టేషన్‌ఘన్‌పూర్ ఒక్కటే భారత్ రాష్ట్ర సమితి గెలిచింది.
రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు: హరీశ్‌రావు - Harishrao hot comments
Lok Sabha Election 2024 : మారిన రాజకీయ పరిస్ధితుల్లో భాగంగా ఆయన మూడు మాసాల్లోనే గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో ఇటీవల భారత్ రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంత వరకు ఫలితం ఇస్తుందో చూడాలి.
ఇటీవల వేలేరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజవర్గం బీఆర్ఎస్ (BRS Focus on Strengthening Party) శ్రేణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇది కార్యకర్తలకు కొంత ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. కడియం వెంట ఆయన అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు. పాత బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి బాటలో వెళ్లకపోవడం గులాబీ కార్యకర్తలకు ఊరటనిచ్చే అంశం.
మరోవైపు కడియం శ్రీహరి హస్తం పార్టీలో చేరడాన్ని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్ఠానం వరంగల్ లోక్‌సభ స్థానాన్ని ఆయన కుటుంబానికి కేటాయిస్తే వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల తరువాత కడియం శ్రీహరికి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో బెర్తు లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది.
ప్రజాబలం ఉంటే కడియం శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి : బీఆర్ఎస్ నేతలు - Lok Sabha Elections 2024