BRS Party Chevella Parliamentary Meeting : మంత్రిని చేస్తే పట్నం మహేందర్ రెడ్డి సహకరిస్తారని అనుకున్నామని కానీ సునీత, మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచి ఓటమికి కారకులయ్యారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) అన్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పార్టీ మారిన వారిపై ధ్వజమెత్తారు.
రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి నాకంటే ఎక్కువగా కాంగ్రెస్‌ను తిట్టారని కేటీఆర్ చెప్పారు. వీరిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారని ధ్వజమెత్తారు. కవిత అరెస్టు(MLC Kavitha Arrest) అయితే నవ్వుకున్నారని అన్నారు. పార్టీ మారిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజలను కొందరు నాయకులు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
KTR Fires on Congress : తన వల్లే పరిశ్రమలు వచ్చాయని రంజిత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గు చేటు అని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. ఈసారి మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కేసీఆర్ కాళ్లు పట్టుకొన్నా పార్టీలో చేర్చుకోమని స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేశవరావు, కడియం శ్రీహరి జారుకుంటున్నారన్నారు. పదవులు అనుభవించి పార్టీ నుంచి పోయేవాళ్లు రాళ్లు వేసి పోతారని అన్నారు. కాలమే వారికి సమాధానం చెబుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను చేవెళ్లలో భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీని ఆగం చేసే ఉద్దేశం మాకు లేదు : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు గెలవలేరు కానీ కేసీఆర్‌ను తొక్కుతారా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఫోన్‌ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారు, ఈ వ్యవహారంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోండని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన వాళ్లు బాధ పడే పరిస్థితి వచ్చిందన్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ సభ(Congress Sabha at Tukkuguda)కు కర్ణాటక నుంచి కూడా జనాలను తెప్పిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్‌ను సభను విజయవంతం చేద్దాం : ఏప్రిల్ 13న చేవెళ్లలో కేసీఆర్ సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం, ఉద్యమం ఉద్ధృతం చేద్దామని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల తర్వాత 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి పోయే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే అని విమర్శలు చేశారు. తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్ అని హర్షం వ్యక్తం చేశారు.
"ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు. మంత్రిని చేస్తే పట్నం మహేందర్ రెడ్డి సహకరిస్తారని అనుకున్నాం. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి నా కంటే ఎక్కువగా కాంగ్రెస్‌ను తిట్టారు. వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు. కవిత అరెస్టు అయితే వారు నవ్వుకున్నారు. పార్టీ మారిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలి. సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజలను మోసం చేస్తున్నారు." - కేటీఆర్, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయం : కేటీఆర్
పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి : కేటీఆర్