Kavitha KCR Emotional Moments : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం రోజున హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ (ఆగస్టు 29వతేదీ) మధ్యాహ్నం ఆమె తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లారు. తన భర్త అనిల్, కుమారుడు ఆదిత్యతో పుట్టింటికి వచ్చిన కవితకు, ఎర్రవల్లి గ్రామస్థులు మంగళహారతి పట్టి ఘనస్వాగతం పలికారు.
అనంతరం కేసీఆర్ పాదాలకు నమస్కరించి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. ఐదు నెలల తర్వాత కుమార్తెను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు. కవితను చూసి కేసీఆర్ ఆనందంతో ఉప్పొంగారు. తమ అధినేత సంతోషంలో భాగస్వామ్యులైన సిబ్బంది, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ ఆలింగనం చేసుకున్న ఫోటోను కవిత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసారు. కవిత వెంట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పదిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 29, 2024
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత 164 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన పూచీకత్తును కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. వాటిని అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు కవిత విడుదలకు అనుమతిస్తూ తీహాడ్ జైలుకు వారెంట్ జారీ చేసింది.