BRS Madhusudhana Chary Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తన పాలనా వైఫల్యం కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ చర్యలు మొదలు పెట్టారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. ఫోర్త్ సిటీ పేరుతో మరో రాజకీయం మొదలు పెడుతున్నారని విమర్శించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, నవీన్ కుమార్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత కొన్నిరోజులుగా హైదరాబాద్ మహానగరంలో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రానే ఇందుకు కారణమన్న ఆయన హైడ్రాకు కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డినేనని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌ను తిట్టడం తప్ప ఏం రావడం లేదు : పది నెలలుగా రాష్ట్రంలో పాలన పడకేసిందని, గ్యారంటీలపై, రైతు రుణమాఫీ ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. పంట కాలం అయిపోతున్నా రైతుబంధు ఊసే లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని, గురుకులాల్లో మెస్సులు సరిగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ హైడ్రా చర్యలను వ్యతిరేకిస్తున్నారని చివరకు హైకోర్టు కూడా హైడ్రా దూకుడును తప్పు పట్టిందన్నారు. సీపీఐ నేత కూనంనేని కూడా హైడ్రాకు దారి తెన్నూ ఏమీ లేదని ఆరోపించారని, కేసీఆర్‌ను తిట్టడం తప్ప రేవంత్‌కు ఏమీ చేత కావడంలేదని ఆరోపించారు.
ఇందిరమ్మ పాలనలో 1976లో దిల్లీలో తుర్క్‌మన్ గేటులో పేదల ఇళ్లపై బుల్డోజర్లు ఎక్కించారని, అడ్డు వచ్చిన పది మంది పేదల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. మళ్లీ ఆ ఇందిరమ్మ పాలనను అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎపుడూ వచ్చినా పేదలపై ప్రతాపం చూపిస్తుందన్న ఆయన పేదలపై ప్రతాపాన్ని చూపిస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆదివారం వారి పర్యటనలో బాధితులు తమ గోడు చెప్పుకున్నారని వారికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనను ప్రజలు మరోమారు గుర్తు తెచ్చుకుంటున్నారన్న మధుసూదనాచారి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కూల్చివేతలు ఆపేసీ ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. డబ్బులిచ్చి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నామని బీఆర్ఎస్పై మంత్రి శ్రీధర్ బాబు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
పేదల గుండెల్లో గునపాలు గుచ్చుతున్నారు : రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట పేదల గుండెల్లో గునపాలు గుచ్చుతున్నారని ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆరోపించారు. తెలంగాణ భవన్‌కు వందలాది మంది బాధితులు వచ్చి తమ గోడు చెప్పుకుంటున్నారన్నారు. దీన్ని బట్టే ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో తెలుసుకోవచ్చన్న రమణ ఇందిరమ్మ పాలనలో ఇండ్లు కడతారు అనుకుంటే కూలుస్తున్నారని ధ్వజమెత్తారు.