BRS Leaders Visit Medigadda Project : శాసన సభ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్‌హౌస్‌లు ఆన్ చేసి బీడు భూములకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్‌ను బదనాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు కాళేశ్వరం పంప్‌హౌస్‌లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్‌తో పాటు మేడిగడ్డను కేటీఆర్ పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు.
మూడు రోజులకు ఒకసారి తాగునీరు : కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు. హైదరాబాద్‌కు కూడా మంచినీళ్లు అందించొచ్చని సూచించారు. 15 టీఎంసీలతో కొండ పోచమ్మ సాగర్, 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టుకున్నామని తెలిపారు. లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారని మండిపడ్డారు. పది లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా కిందకు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వంరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందన్నారు .
బదనాం చేయనికే ప్రయత్నాలు : గోదావరిలో నీరుంది కానీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం జలాల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. పంప్‌హౌస్‌లు ఆన్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంజినీర్లు చెప్పారని మాజీ మంత్రి తెలిపారు. నీటిని లిఫ్ట్ చేస్తే రెండు రోజుల్లో మిడ్ మానేరుకు చేరుకుంటాయన్న ఆయన పంప్‌హౌస్‌లపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కేసీఆర్‌ను బదనాం చేసేందుకు కాంగ్రెస్ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తామని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చాం : కేటీఆర్ - BRS Leaders Visited Medigadda
"పాలేరు, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, ఆదిలాబాద్, హుజూరాబాద్, హుస్నాబాద్, గజ్వేల్, భువనగిరిలోని రైతులతో ఇక్కడికి వచ్చి పంప్ హౌస్ ఆన్ చేస్తాం. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తే మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లను గోదావరి నీటితో నింపొచ్చు. పైన ఉన్న సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లలోనూ నీళ్లు లేవు, వీటికీ కాళేశ్వరమే ఆధారం, మరో ప్రత్యామ్నాయం లేదు. " - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఎందుకింత నిర్లక్ష్యం : కేసీఆర్ పంచభక్ష పరమాన్నం సిద్ధం చేసి పెడితే నీళ్లు ఎత్తిపోయడానికి ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్లు కళ్లముందు నుంచి వృధాగా పోతున్న నేర పూరిత కుట్రతో నీళ్లు ఎత్తిపోయడం లేదని విమర్శించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంజినీర్లతో మాట్లాడామన్న ఆయన కేవలం 30 వేల క్యూసెక్కుల నీరు ఉంటే ఎత్తిపోయవచ్చని తెలిపారని చెప్పారు. 9 లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నా నీరు ఎత్తిపోయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరమే కరవును పారదోలే “కల్పతరువు" : కేటీఆర్ - KTR will Visit Medigadda Soon