BRS Chief KCR on Party Future in Telangana : ఓవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి మరోవైపు కొనసాగుతున్న వలసలు భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి విస్తృత చర్చ జరుగుతోంది. ఇంటా బయటా ఊహాగానాలు, భిన్నమైన కథనాలు జోరుగా సాగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు అధినేత కేసీఆర్‌తో విడివిడిగా కలుస్తున్నారు.
బీఆర్ఎస్ కార్యాచరణపై నేతలతో కేసీఆర్ సమావేశం : కొందరు తమంతట తామే వెళ్తుండగా మరి కొందరు నేతలను పిలిపిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి, నేతల వలసలు, క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పనితీరు, హామీల అమలు సహా ఇతర అంశాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతానని, కేసీఆర్ వెన్నంటే ఉంటామని వారు చెబుతున్నట్లు సమాచారం. పార్టీ తరపున గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరడం తమకు బాధ కలిగించిందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
KCR Focus On Migration Of Leaders : వలసల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఒడిదొడుకులు బీఆర్ఎస్కు కొత్త కాదని కేసీఆర్ వారితో అంటున్నట్లు సమాచారం. కొంచెం ఓపిక పడితే మళ్లీ ప్రజల్లో ఆదరణ లభిస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల విద్యుత్ , తాగు నీటి సరఫరా వంటి అనేక అంశాల్లో నష్టం జరుగుతున్నదన్న అంశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని నేతలకు అధినేత చెబుతున్నట్లు తెలిసింది.
ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి : అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ వాటి పరిష్కారం కోసం కృషిని కొనసాగించాలని కేసీఆర్ వారికి సూచిస్తున్నట్లు సమాచారం. కొంత సందిగ్ధంలో ఉన్న, పార్టీ మారతారని ప్రచారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, నేతలకు అన్ని అంశాలు విడమర్చి చెబుతూ పార్టీలోనే కొనసాగాలని బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్ లో తప్పకుండా మంచి అవకాశాలు కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీనేతలతో కేటీఆర్, హరీశ్‌రావుల మంతనాలు : కేటీఆర్, హరీశ్ రావు కూడా కొంత మంది నేతలతో విడిగా మాట్లాడుతున్నారు. త్వరలోనే పార్టీ సమావేశాన్ని నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. సమావేశం ద్వారా నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజలకు స్పష్టమైన సందేశం పంపాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లా పరిషత్ పాలక మండళ్ల పదవీకాలం త్వరలో ముగియనున్న తరుణంలో జెడ్పీ ఛైర్‌పర్సన్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించే కార్యాచరణకు కూడా కేసీఆర్ త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల వరుస పార్టీ ఫిరాయింపులు - సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్