BRS MP Candidate Vinod Kumar On Bandi Sanjay : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులకు అనుమతులు తీసుకువచ్చిన తర్వాతే ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై బండి సంజయ్ మాట్లాడాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇచ్చంపల్లిలో నిర్మించబోయే ప్రాజెక్టుకు ఇంటర్ లింక్స్ ఇవ్వకుండా పనులు ఎట్లా ప్రారంభిస్తారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ బండి సంజయ్‌ను ప్రశ్నించారు. ఇప్పటికే నదుల అనుసంధానానికి కేంద్రం కసరత్తు చేస్తోందని, నదుల అనుసంధానంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగనుందని వినోద్ ఆక్షేపించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలన్న ఆయన, పెండింగ్‌లో ఉన్న సమ్మక్క సారక్క, సీతరామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాతే నదుల అనుసంధానం, ఇచ్చంపల్లి గురించి ఆలోచించాలని అన్నారు.
"మీ ఎంపీ బాధ్యతలను సక్రమంగా ఉపయోగించి, ప్రజాభివృద్ధికై దిల్లీలో తిరగాలి. వివిధ మంత్రిత్వ శాఖల వద్దకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం పాటుపడాలి. కానీ మీరు(బీజేపీ నలుగురు ఎంపీలు) ఏమిచేస్తున్నారు. ప్రాజెక్టుల విషయంలో పూట్లు పొడుస్తున్నారు. ఇప్పటికైనా దయచేసి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతి ఇచ్చేలా మీరు చొరవ తీసుకోవాలి."-వినోద్ కుమార్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
గోదావరి జలాలు తరలిస్తే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటి? : తెలంగాణకు వచ్చే జలాలను కొల్లగొట్టేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని దుయ్యబట్టారు. గోదావరి నది జలాలు తరలించుకుపోతే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల వాతావరణంలో ఎవ్వరు పట్టించుకోరనే ఇప్పుడు ఎంవోయు విడుదల చేశారని ఆయన మండిపడ్డారు.
సంస్కృతి ధర్మం గురించి మాట్లాడుతున్న బండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు దేవతలకు సంబంధించిన నామకరణములు చేశామని బండి సంజయ్ తెలుసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. హైందవ ధర్మము, ధర్మం గురించి మాట్లాడుతున్న సంజయ్, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులపై పోటుపడుతున్న ఆయన స్పందించకపోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు.
BRS Leader Vinod Kumar Demands on Godavari Waters : తెలంగాణలో గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు ప్రాజెక్టుల అనుమతుల కోసం కేంద్రం వద్ద పాటుపడాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నాలుగు ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాతనే ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై మాట్లాడాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమార్ వైరమ్యాలు సృష్టించకుండా ప్రజల కోసము పాటుపడాలని అన్నారు. ప్రాజెక్టులపై సంజయ్ స్పందించాలని కోరారు.
మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాపర్ డ్యాం కడుతామంటున్నారన్న వినోద్‌కుమార్, నాలుగు నెలల నుంచి ఏం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చేపడితే ఈపాటికి పనులు అయిపోయేవని అన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుచుంటే కేసీఆర్ వెంటనే పనులు చేపట్టి వేసవిలో నీరందించేవారని తెలిపారు.
తెలంగాణ హక్కుల విషయంలో కేంద్రం వద్ద కేసీఆర్ సర్కార్ ఎన్నడూ రాజీ పడలేదు : వినోద్ కుమార్