KTR Reaction on Coal Mine Auction: తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ పరిరక్షించలేదంటూ ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్‌పై, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దుస్సాహసాన్ని చూసి, సమాధిలో ఉన్న జోసెఫ్ గోబెల్స్ ఉలిక్కిపడ్డారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను వినిపించి, స్పందించిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల నిజమైన ఆకాంక్షలను వినడానికి నిరాకరించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ వేలాది మంది యువకులను క్రూరంగా తొక్కించి, నిర్దాక్షిణ్యంగా చంపిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తెలంగాణలోని ప్రతి పౌరుడు గమనిస్తున్నాడు : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఏ విధంగా పని చేస్తున్నాయో ప్రతి తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల అమ్మకాలను కేసీఆర్, బీఆర్ఎస్ ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తోందని, ప్రస్తుత ప్రభుత్వం తరహాలో ఎవరూ వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు.
బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు : చివరి రౌండ్లో రెండు బ్లాకులను ఏకపక్షంగా వేలం వేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అని, బీఆర్ఎస్ వ్యతిరేకించినందుకే ఇప్పటి వరకు ఆ బ్లాకుల్లో తవ్వకాలు మైనింగ్ జరగలేదని వివరించారు. బీజేపీ ప్రభుత్వం బ్లాకులు కేటాయించిన తర్వాత కూడా ఆ రెండు కంపెనీలను ఒక్క అంగుళం కూడా తరలించేందుకు తమ ప్రభుత్వం అనుమతించకపోవడమే బీఆర్ఎస్కు వాటితో ఎలాంటి సంబంధం లేదనడానికి నిదర్శమని పేర్కొన్నారు.
సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా : కిషన్‌రెడ్డి - Kishan Reddy on Coal Mine Auction
మళ్లీ అదే కంపెనీకి గనులు : 2021లో కాంగ్రెస్ - శివసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలోని టాక్లీ జెనా బెల్లోరాలో కూడా ఇదే కంపెనీకి గనులు లభించాయన్న విషయం మర్చిపోవద్దని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులను తాకట్టు పెట్టే నేరంలో కాంగ్రెస్, బీజేపీ భాగస్వాములని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నదీజలాల విషయంలో ఈ ప్రాంత హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ ఎలా విఫలమైందో, తెలంగాణ ప్రజలు ఇప్పటికే చూశారని కేటీఆర్ దుయ్యబట్టారు.
త్వరలో తగిన గుణపాఠం : సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో బీజేపీకి, కాంగ్రెస్ సహకారం కూడా స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయడానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వేదికను పంచుకోవడాన్ని చరిత్ర మరిచిపోదని ఆయనన్నారు. అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారని హెచ్చరించారు.