Harish Rao Letter To CM On Education System : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పాఠశాల విద్య మొదలుకొని ఉన్నతవిద్య వరకు సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ గాడితప్పుతుందన్న ఆయన, ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, దుస్తుల కొరత, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం వంటి సమస్యలు తెలంగాణ విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
Harish Rao Comments on CM Revanth : విద్యాశాఖను కూడా నిర్వర్తిస్తున్న సీఎం రేవంత్, రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యమిస్తున్నారు తప్ప, ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం చేస్తున్నవి కొనసాగించడంలోనూ ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందన్నారు.
పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పాఠశాలల్లో దోమలు, ఈగలు ముసురుతున్నాయన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో సిలబస్ ప్రకారం, పాఠ్యాంశాలు పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారిందని, కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో అంధకారం అలుముకుంటున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు.
సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలి : ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న భోజన బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఎస్జీటీల బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ సుమారు 9 వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ బడులకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని, పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తామన్న సిబ్బందిని వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులకు ఒక్క జత బట్టలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, రెండు జతల బట్టలు అందించాలని కోరారు. విద్యార్థుల ఆకలి తీర్చే సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని, సర్వశిక్షా అభియాన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి అని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.