BRS Political Graph In Adilabad : శాసనసభ ఎన్నికల కంటే ముందు వరకు ఉమ్మడి ఆదిలాబాద్ బీఆర్ఎస్ కంచుకోటగా నిలిచింది. మంత్రులుగా ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ విప్‌గా బాల్క సుమన్‌తో మొత్తం 10 మంది శాసనసభ సభ్యులతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉండేది. ఇప్పుడంతా గతమన్నట్లుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్, బోథ్‌లో మినహా మిగిలిన 8 స్థానాల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పొందింది. అక్కడితో ఆగకుండా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి సహా చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరటంతో బీర్ఎస్ రాజకీయ ప్రభావం మరింత మసకబారినట్లయ్యింది.
Changing Politics In Adilabad : పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు బ్యాంకుతో మళ్లీ పుంజుకుంటుందనుకున్న తరుణంలో, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సక్కు మూడో స్థానంలో నిలవటంతో శ్రేణుల్లోనూ నైరాశ్యం ఆవహించింది. నియోజకవర్గాల వారీగా లోపాలను గుర్తించి శ్రేణులకు మనోధైర్యం కల్పించటంపై అధిష్ఠానం సైతం దృష్టి సారించటం లేదు. ఇప్పటికీ కీలక నేతలుగా ఉన్న జోగు రామన్న, బాల్క సుమన్ సహా ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, అనిల్ జాదవ్ మధ్య సరైన సఖ్యత లేదు. దీంతో తీవ్ర నైరాశ్యానికి లోనైన ఎమ్మెల్సీ దండె విఠల్ సైతం ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధపడటం బీఆర్ఎస్లో కలకలం రేకెత్తిస్తోంది.
పార్టీ నాయకుల్లో అసంతృప్తులు : కేసీఆర్, కేటీఆర్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఎమ్మెల్సీ దండె విఠల్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శ్రేణులందరినీ సమన్వయం చేస్తారనే పేరుంది. పైగా కోనేరు కోనప్ప కాంగ్రెస్‌లో చేరిన తర్వాత దండె విఠల్ సిర్పూర్(టి) కేంద్రంగా బీఆర్ఎస్ను బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్(టి) నియోజకవర్గంపై దృష్టి సారించినప్పటికీ, అధిష్ఠానం అభ్యంతరం చెప్పటం లేదనే అసంతృప్తికి లోనైన దండె విఠల్, పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన జులై మొదటి లేదా రెండో వారంలో కాంగ్రెస్‌లో చేరటం పక్కాగా కనిపిస్తోంది. దండె విఠల్ ఒక్కరే కాంగ్రెస్‌లో చేరుతారా? ఆయన మార్గంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
నాయకుల మధ్య సమన్వయ లోపం : ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్‌ను అధినేత కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలైన జోగు రామన్న, బాల్క సుమన్, ఆత్రం సక్కు, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య మధ్య కూడా సఖ్యత లేదు. నియోజకవర్గాల్లో శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరనే అభిప్రాయం ఉంది. అధిష్ఠానం దిశానిర్దేశంపైనే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ రాజకీయం ఆధారపడి ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.
భవిష్యత్ కార్యచరణపై కేసీఆర్ ఫోకస్ - త్వరలో నేతలతో కీలక సమావేశం! - KCR MEETING WITH BRS LEADERS SOON