BRS Chief KCR Press Meet at Suryapet : నీళ్లిస్తామన్నారనే నమ్మి పంటలు వేసుకున్నామని రైతులు చెప్పారని మాజీ సీఎం కేసీఆర్(KCR) అన్నారు. ముందే చెబితే పంటలు వేసుకునే వాళ్లం కాదని రైతన్నలు అంటున్నారన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు చేపట్టిందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు అనేక పద్ధతుల ద్వారా నీరు సరఫరా చేశామని గుర్తు చేశారు. రైతుకు రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. రెప్పపాటు కాలం కూడా కరెంటు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో వ్యవసాయం అద్భుతమైన దశకు వెళ్లిందన్నారు. పండిన ప్రతి గింజనూ తమ హయాంలో కొన్నాం, ధాన్యం దిగుబడిలో పంజాబ్‌ను కూడా దాటేశామని వివరించారు.
కానీ ఇంత తక్కువ సమయంలో రైతులకు ఇంత కష్టకాలం వస్తుందని తాము అనుకోలేదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. లక్ష ఎకరాల పంటలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. రైతులు మళ్లీ ఆత్మహత్యలు(Farmer Suicides in Telangana) చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదని ఆవేదన చెందారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో పాత్రికేయులు కూడా ఆలోచించాలన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి వాటికి ప్రాధాన్యం లేదన్నారు. దేశంలోనే నంబరు వన్ స్థానంలో ఉన్న రాష్ట్రం స్వల్పకాలంలో ఈ దుస్థితికి ఎందుకు రావాలి అని కేసీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ ప్లాన్ ఛేంజ్ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్ షోలతోనే ఎన్నికల ప్రచారం
"ప్రపంచమే మెచ్చిన మిషన్ భగీరథ నిర్వహణలో లోపాలెందుకు వస్తున్నాయి?. మా హయాంలో బిందె పట్టుకుని ఏ ఆడబిడ్డ కూడా కనిపించలేదు?. మా హయాంలో ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు కనిపించలేదు. హైదరాబాద్‌లో కూడా నీళ్ల ట్యాంకర్లు ఎందుకు కనిపిస్తున్నాయి. మా మెదడంతా కరగదీసి అద్భుతంగా కరెంట్ అందించాం. అప్పట్లో కరెంట్ పోతే వార్త.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త. ఇంత స్వల్పకాలంలో ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? అగ్రగామి రాష్ట్రానికి ఎందుకు చెదలుపట్టింది. ఉన్న వ్యవస్థను ఉన్నట్టు జరిపించుకోలేని అసమర్థత ఏంటి?." - కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత
Lok Sabha Election 2024 : ప్రభుత్వ అసమర్థత, అలసత్వం కారణంగానే ఈ దుస్థితి తలెత్తిందని మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ సిటీగా మేం మార్చామని గుర్తు చేశారు. రాత్రింబవళ్లు కొట్లాడి నేషనల్ పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయించామని, 7 వేల మెగా వాట్ల స్థాపిత సామర్థ్యాన్ని 18 వేల మెగావాట్లకు పెంచామన్నారు. ఇప్పుడు రామగుండం నుంచి తాజాగా 1600 మెగావాట్ల సామర్థ్యం కూడా అదనంగా వచ్చిందని తెలిపారు. యాదాద్రిని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కానీ లేకుంటే అది కూడా పూర్తయ్యేదని అన్నారు.
KCR Fires on Congress : ఇది పాలకుల అసమర్థతా కాదా అన్నది ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఏడేళ్లపాటు అద్భుతంగా నడిచిన వ్యవస్థ ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా ఆగిపోయిందని ప్రశ్నించారు. అసమర్థ, అవివేక, తెలివి తక్కువ, కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. టెక్రోక్రాట్ల స్థానంలో ఐఏఎస్‌లను తెచ్చిపెట్టారని వివరించారు. తమ హయాంలో రైతుబంధు సకాలంలో రైతులకు అందేదని పేర్కొన్నారు. రైతుబంధు విషయంలో అనుమానాలకు తావిచ్చారు, 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని తెలిపారు. పంటలు ఎండని జిల్లా అంటూ రాష్ట్రంలో లేదని, కానీ మంత్రులు కనీసం సమీక్ష కూడా చేయలేదని మాజీ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు.