Ex CM KCR Election Campaign in Narsapur : రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారమెక్కిన కాంగ్రెస్ పార్టీ, కేవలం ఐదు నెలల పాలనలోనే రాష్ట్రాన్ని ఆగమాగం చేసిందని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. వరి నాట్లు వేసేటప్పుడు వేయాల్సిన రైతు బంధు, కోత కోసిన తర్వాత ఇస్తుందని నిట్టూర్చారు. దీనికంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరు, నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్న గులాబీ బాస్, మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి, ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏవీ అమలు చేయలేదని కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు వచ్చిందా? రుణమాఫీ అయ్యిందా? కరెంట్ సరిగా వస్తుందా? అని సభావేదికగా ప్రజలను ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సరిగా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయిందని, ఇప్పుడెందుకు కరెంట్ కోతలు పుట్టుకొస్తున్నాయన్నారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికుల పొట్ట కొట్టారని విమర్శించారు.
"బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మంజీరా నది, హల్దీ వాగులపై ఎన్నో చెక్ డ్యామ్‌లను కట్టించాను. దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం. అదంతా ఇప్పుడు దెబ్బతీసే పరిస్థితి వస్తోంది. అంటే తాగు నీరు రావు. సాగు నీళ్లు రావు. కరెంట్ రాదు. పేదల సంక్షేమం లేదు. నాడు వృద్ధులకు రూ.2 వేలు పెన్షన్ ఇచ్చుకున్నాం, దాన్ని కాంగ్రెస్ వాళ్లు రూ.4 వేలు ఇస్తామన్నారు. మరి వచ్చాయా? అవి వచ్చే నమ్మకం ఉన్నదా? ఏ ఒక్క హామీ నెరవేర్చలే, ప్రతిదానికి ఏదో ఒక సాకు చెప్పటం అలవాటుచేసుకుంది."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
తెలంగాణ కోసం ప్రాణమైనా ఇస్తా కానీ, అన్యాయం జరగనివ్వను : తెలంగాణ ఉద్యమ సమయంలో తనను దీవించారని, పదిహేనేళ్లు పోరాటం చేసి చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానని కేసీఆర్ పునరుద్ఘాటించారు. సాధించుకున్న తెలంగాణలో పదేళ్లపాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, ఆ తర్వాత ఒక్కోటి బాగుచేస్తూ రాష్ట్రాన్ని పొదరిల్లులాగా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణమైనా ఇస్తా కానీ, అన్యాయం జరగనివ్వనని అన్నారు.
BRS Chief KCR Fires on BJP : రాష్ట్ర హక్కులు కాపాడుకోవాలంటే బీఆర్ఎస్కు డజన్‌కు పైగా ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. మోదీ అజెండాలో పేదల కష్టాలు ఉండవన్న ఆయన, పాకిస్తాన్‌ను చూపించి ప్రజలను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తారని విమర్శించారు. పాక్ పేరుతో ప్రతిసారి ఓట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. అదానీ, అంబానీకి రూ.15 లక్షల రుణాలు మాఫీ చేసిన మోదీ సర్కార్, ప్రభుత్వరంగ కంపెనీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆక్షేపించారు. పెట్టుబడుదారులకు మాత్రమే కాపలాకాసేది బీజేపీ ప్రభుత్వమని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
మాకు 12 సీట్లు ఇస్తే, గుంపు మేస్త్రీ ఇంటికి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - lok sabha elections 2024