BJP Vijaya Sankalpa Yatra : లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రచారం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన 5 విజయ సంకల్ప యాత్రల్లో నాలుగింటికి మంగళవారం శ్రీకారం చుట్టింది. కృష్ణమ్మ క్లస్టర్ యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రారంభించగా, కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమురం భీం క్లస్టర్ యాత్రకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్రకు గోవా సీఎం ప్రమోద్ సావంత్(Pramod Sawant) హాజరయ్యారు. రాజరాజేశ్వర క్లస్టర్ యాత్రను కేంద్రమంత్రి బీఎల్ వర్మ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ శ్రీకారం చుట్టారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, ధర్మబద్ధమైన మోదీ(Modi) పాలన కావాలో, అవినీతి, దోపిడీమయమైన కాంగ్రెస్ పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలో విజయ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. అక్కన్నుంచి రథయాత్రగా వెళ్లి మక్తల్, నారాయణపేటల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించిన పాపానికి ఈ రెండు రాష్ట్రాల్లో సంపదను దోచి, రాహుల్ బృందం లోక్‌సభ ఎన్నికల్లో పంచి పెట్టాలని చూస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు గోవా ముఖ్య మంత్రి ప్రమోద్ సావంత్, భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట తప్పుడు హామీలిచ్చిన కాంగ్రెస్(Congress) రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కుమురంభీం క్లస్టర్ బీజేపీ విజయ సంకల్ప బస్సు యాత్ర నిర్మల్ జిల్లా బాసర నుంచి ప్రారంభమైంది. బాసర అమ్మవారి ఆలయంలో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు, మహేశ్వరరెడ్డి ప్రత్యేక పూజలు చేసి యాత్ర ప్రారంభించారు.
BJP Vijaya Sankalpa Yatra For Elections in Telangana : బైంసాలో జరిగిన బహిరంగ సభలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్(BRS) నేతలు కాళ్ల బేరానికి వచ్చినా పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొననున్నారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
'దోపిడీ, దగా చేసే కుటుంబ పార్టీలకు ఓటు వేయకండి. కాంగ్రెస్ పార్టీ గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ వాళ్ల కుటుంబాల కోసం ఆలోచన చేస్తాయి. మూడు నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రాహుల్ గాంధీ ట్యాక్స్ వేస్తున్నారు మన మీద. పార్లమెంట్ ఎన్నికల ట్యాక్స్ వేస్తున్నారు మన మీద కాంగ్రెస్ నాయకులు'. - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదు : హరీశ్‌రావు
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం : బండి సంజయ్