MP Laxman on Reservation Cancellation : రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫేక్ వీడియో ద్వారా ప్రధాని మోదీ అభివృద్ధి జెండాపై అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు తీసివేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎంపీ లక్ష్మణ్ పార్టీ శ్రేణులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ బీజేపీకి ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజలను రెచ్చగొట్టేలా చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చెల్లవని సీఎం రేవంత్‌ను హెచ్చరించారు. మతపరమైన రిజర్వేషన్లను గతంలో కాంగ్రెస్సే తీసుకొచ్చిందని, ఎస్సీ, ఎస్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు.
బీజేపీపై రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం : స్వయంగా ప్రధాని మోదీ, అమిత్ షా రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు రద్దు చేయడంలేదని చెప్పారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రధానమంత్రి అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తుతోందని అన్నారు. తమ పార్టీపై కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చే వాటాలను ముస్లింలకు పంచిపెడుతున్నారని చెబితే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
మతపరమైన రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎక్కడా కూడా ప్రస్తావించలేదని లక్ష్మణ్ చెప్పారు. మతం పేరుతో ఉమ్మడి రాష్టంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు. అదే రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే బీసీలో ముస్లింలు కొనసాగుతున్నారని, బీసీలో వారిని చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని, చట్టం విరుద్ధమని పేర్కొన్నారు.
Laxman on Congress and BRS : మరోవైపు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దేనికి తాకట్టు పెట్టారో రేవంత్‌రెడ్డి చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇవాళ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి లౌకికవాదం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు.
'ఇవాళ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని ప్రజలు గుర్తించారు. ఎన్నికల ప్రచారంలో మోదీ ఎజెండాతో ముందుకు వెళ్తోంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు తీసివేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టడానికి చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చెల్లవని రేవంత్‌రెడ్డి గమనించాలి'-లక్ష్మణ్, బీజేపీ ఎంపీ