BJP MLA Katipally Comments on Assembly Etiquette : రెండో విడత రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఇదొక శుభ సూచకమని బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అన్నారు. మూడో విడత కూడా త్వరలో పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలో 35లక్షల మెట్రిక్ టన్నుల పాడి ప్రొక్యూర్మెంట్పై ప్రభుత్వం టెండర్ వేసిందని, ఇప్పటి వరకు ఎంత పంటను లిఫ్ట్ చేశారనేది చెప్పాలని డిమాండ్ చేశారు.
పాడి ప్రొక్యూర్‌మెంట్ సరైన పద్దతిలో జరగడంలేదని ఆక్షేపించారు. శాసనసభలో పద్దులపై జరుగుతున్న చర్చలో పాల్గొన్న వెంకటరమణారెడ్డి పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ధరణి వల్ల భూములు అటు ఇటుగా మారి ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ధరణి మీద కమిటీ వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతవరకు వేయలేదన్నారు. ధరణి సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు.
పోడు భూముల సమస్యలు పరిష్కరించట్లేదు : కొత్తగా మండలాలను ఏర్పాటు చేశారు కానీ ఇంతవరకు దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లేదని తెలిపారు. వీఆర్ఏలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీ స్థాయిలో కింది స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలకు కొత్త భవనాలు నిర్మించాలని, మౌలిక వసతులు మెరుగు పడాలని తెలిపారు. పోడు భూముల సమస్యలకు పరిష్కారం జరగ లేదని, ప్రభుత్వం పోడు భూములపై దృష్టి పెట్టాలన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు రక్షణ కింద గన్మెన్లను కేటాయించాలని కోరారు.
రన్నింగ్ కామెంటరీ కాదు సభ మర్యాదలు గౌరవించాలి : ఎమ్మెల్యే అంటే ఏదో అనుకున్నానని, ఏదో మాట్లాడాలనుకున్నానని కొత్తగా వచ్చిన తాను అసెంబ్లీలో చాలా మాట్లాడాలని ఎన్నో రాసుకున్నట్లు వెంకటరమణారెడ్డి వివరించారు. కానీ అసెంబ్లీలో ర్యాగింగ్ చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
రన్నింగ్ కామెంటరీ కాదు, సభ మర్యాదలు గౌరవించాలని సభ్యులనుద్దేశించి పలికారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమని అందరు అనుకుంటున్నారు కానీ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని తాననుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సభ మర్యాదలు కాపాడి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి చర్చ జరిగితే అది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతోందన్నారు.
"నేను కొత్తగా ఈ సభలోకి వచ్చాను. సభ ద్వారా ఎన్నో మాట్లాడాలని, బడికి పోయే పిల్లవాడిలా రాత్రంతా కూర్చొని ప్రజా సమస్యలను రాసుకున్నాను. కానీ అసెంబ్లీలో ర్యాగింగ్ చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయి. సభ నడిపేటప్పుడు కనీసం సభా సంస్కారం ఉండాలి, ఎదుటివారు మాట్లాడేటపుడు మనం మాట్లాడకూడదు. సభాధ్యక్షుడు చూస్తారనే ఆలోచనైనా కలగాలి."-కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే
విద్యుత్ అక్రమాలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి కీలక వ్యాఖ్యలు - ఏమ్మన్నారంటే? - BJP MLA KVR COMMENTS