Bandi Sanjay Visit Tirumala Temple: తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత వేదాశీర్వచనం చేసిన పండితులు, తీర్థప్రసాదాలు అందజేశారు.
Bandi Sanjay Comments on YSRCP: ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత పాలకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలకులను వీరప్పన్ వారసులని అభివర్ణించారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారని మండిపడ్డారు. శేషాచల అడవుల్లో ఎర్రచందనం దోచేసిన దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. స్వామివారిని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ఆస్తులు పోగేసిన వారి పాలన పోయి రాష్ట్రంలో సేవకుల పాలన వచ్చిందన్నారు.
"శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చింది. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపద దోచుకున్న దొంగలను వదిలిపెట్టేదే లేదు. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటాం. శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతాం. దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, తిరుపతి బీజేపీ నాయకులు అనేక పోరాటాలు చేశారు. నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోంది." - బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
తిరుమల సమాచారం: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు కేటాయించారు. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని నిన్న 73,353 మంది దర్శించుకోగా.. 28,444 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.05 కోట్లు.