Ramoji Rao Commemorative Meeting in Vijayawada : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇందుకోసం విజయవాడ శివారు కానూరు వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రులు, పాత్రికేయ దిగ్గజాలు తదితరులు హాజరయ్యారు.
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి : సీఎం చంద్రబాబు - CM Chandrababu on Ramoji Rao
తెలుగువారికి ఎప్పుడు కష్టం వచ్చినా అండగా నిలబడ్డారు : ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రామోజీరావు రైతు కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. ఈనాడు పత్రికతో ప్రజల్లో చైతన్యం నింపారని తెలిపారు. అలాగే ఈటీవీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపారని కొనియాడారు. రామోజీరావు తెలుగువారికి ఎప్పుడు కష్టం వచ్చినా అండగా నిలబడ్డారని తెలిపారు. సమాజసేవ కోసం విద్యార్థి దశ నుంచే రామోజీరావు కృషి చేశారని వెల్లడించారు. అలాగే రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డారని వెల్లడించారు.
రామోజీరావు వ్యక్తిత్వం ప్రజలకు స్ఫూర్తి దాయకం : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు పేపర్ చదవకపోతే తెల్లారదని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈనాడు, ఈటీవీల ద్వారా రామోజీరావు ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. రామోజీరావు వ్యక్తిత్వం ప్రజలకు స్ఫూర్తి దాయకమని కొనియాడారు. కలాన్ని ఆయధంగా చేసుకుని పోరాటం చేశారని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలకు సేవలందించారని వెల్లడించారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థితికి రామోజీరావు ఎదిగారని తెలిపారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఎవరెస్టు శిఖరంలా ఎత్తుకు ఎదిగారని వెల్లడించారు. ఈనాడు పత్రిక ద్వారా రామోజీరావు సమాజంలో అనేక మార్పులు తెచ్చారని వివరించారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నతస్థితికి చేరుకోవచ్చని రామోజీని చూస్తే అర్థం మవుతుందన్నారు. ప్రజాసమస్యలపై పత్రిక ద్వారా కలం ఝుళిపించారని మంత్రి పార్థసారధి కొనియాడారు.
రాజధానికి అమరావతి పేరును పెట్టడంలో రామోజీ కృషి ఎనలేనిది : సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు ఉన్నత శిఖరాలకు ఎదగడం ఎలాగో మార్గం చూపారని తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చెప్పారు. ఆయన, ఆయన పత్రికలపై కొంత మంది దుమ్మెత్తి పోసినా ఎంతో సంయమనంతో వ్యవహరించారన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు నేనున్నానని ముందుకొచ్చారని తెలిపారు. ఈనాడు పత్రిక ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును పెట్టడంలోనూ ఆయన కృషి ఉందని గుర్తుచేశారు. అమరావతిలో రామోజీ విగ్రహం పెట్టేందుకు కృషి చేయాలని సీఎంను కోరుతున్నానన్నారు. అంతకంటే ఘన నివాళి ఆయనకు ఏమివ్వగలమని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కొనియాడారు.
అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం అందించిన ఈనాడు ఎండీ కిరణ్ - Ramoji Rao Memorial Meet
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ - హాజరైన ప్రముఖులు - Ramoji Rao Memorial Program