Pawan Kalyan Comments on Panchayats: పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కీలకమైన గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే తమ ప్రభుత్వ తపన అని తెలిపారు. గ్రామ సభల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ నిధుల వ్యయంపై పల్స్ సర్వే చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచామన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం రాష్ట్రంలోని 13 వేల 326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామాల్లో ఏ పనులు చేయాలి? ఎలాంటి పనులకు ఆమోదం తెలపాలన్న విషయాల్ని గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము చేపట్టే పనుల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు పెరుగుతాయని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులతో కలిసి సభ జరుగుతుందని వెల్లడించారు.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నా, వాటి ఫలాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించటం లేదని ఆరోపించారు. పథకం లక్ష్యాలకు అనుగుణంగా పనులెక్కడా జరగలేదన్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులు, జరగాల్సిన పనులను ముందుకు తీసుకెళ్లటంపై పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.
జెండావందనం పండగలా చేయాలి: 34 ఏళ్ల క్రితం గ్రామాల్లో స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకల జరిపేందుకు ఇచ్చిన జీవోను మార్చి కొత్తగా నిధులు పెంచుతూ జీవో విడుదల చేశామని తెలిపారు. జెండావందనం గ్రామగ్రామానా సంబరంగా పండుగలా చేయాలని సూచించారు. 5 వేల జనాభా కంటే తక్కువగా పంచాయతీలకు రూ.100లు నుంచి రూ.10 వేలకు, 5 వేల జనాభా దాటిన పంచాయతీలకు రూ.250లు నుంచి రూ.25 వేలకు పెంచినట్లు వివరించారు. సర్పంచులు సగర్వంగా గ్రామంలోని అందరినీ పిలిచి మరీ జెండా పండుగను నిర్వహించుకునేలా వారికి కూటమి ప్రభుత్వం నిధులను ఇస్తోందన్నారు. చేనేత కళాకారులు నేసిన జెండాలనే వినియోగించాలని పిలుపునిచ్చారు.
సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా చూస్తాం: ఏ దశలోనూ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలల పిల్లలకు జెండా పండుగ విశిష్టత తెలిసేలా వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, డిబేట్, క్రీడా పోటీలను నిర్వహించి వారికి బహుమతులు అందజేయాలని సూచించారు. ఎలాంటి ప్లాస్టిక్ జెండాలు, ఇతర పర్యావరణ వినాశక అంశాలు జెండా పండుగ వేడుకల్లో లేకుండా చూడాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచి వ్యవస్థలను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. పంచాయతీలు ఆర్థిక పరిపుష్టి కలిగించి, తిరిగి జీవం పోయాలనే తపనతో వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
అమన్ సెహ్రావత్ కు అభినందనలు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు#OlympicGames #wrestling #AmanSherawat#Paris2024 pic.twitter.com/T6C188siXe
— JanaSena Party (@JanaSenaParty) August 10, 2024
Pawan Kalyan on Wrestler Aman Sehrawat: భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలంపిక్స్‌లో కాంస్యపతకం సాధించటం ఆనందాన్ని కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అమన్ సెహ్రావత్‌కు అభినందనలు తెలియజేశారు. రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమన్నారు. వినేష్ ఫోగట్ దురదృష్టవశాత్తూ ఫైనల్ పోటీకి దూరమైనా అమన్ పతకం సాధించటంపట్ల క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.