Parties Speed UP Election Campaign : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపించడంతో పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. తుది విడత ప్రయత్నాల్లో జోరు పెంచారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బాంబుల గడ్డ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు , సీపీఐ, సీపీఎం నాయకులతో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లాలో సూడిగాలి పర్యటన చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్‌ను గెలిపించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
BRS Election Campaign : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ తుంగతుర్తి మాజీ ఎంఎల్ఏ గాదరి కిషోర్ కుమార్‌తో కలిసి ప్రచారం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రచారం చేశారు. వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్‌ని గెలిపించాలని కోరారు. వర్ధన్నపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి తో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
Jogu Ramanna Fires On BJP : ఓటమి భయంతోనే బీజేపీ కార్యకర్తలు కేటీఆర్ ప్రచార సభలో హనుమాన్ భక్తుల నాటకం ఆడారని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. కేటీఆర్ కాన్వాయ్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట రామిరెడ్డికి మద్దతుగా దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి సైతం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. నాగార్జున సాగర్ నియోజక వర్గంలో పార్టీ నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముస్లిం ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
BJP Election Campaign : సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రచారం చేశారు. దోమలగూడలోని ఇందిరాపార్కులో ఉదయం నడక కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడారు. కమలం గుర్తుకు ఓటు వేయాలని లక్ష్మణ్ అభ్యర్థించారు. ఎమ్మెల్యే పాయల్‌శంకర్‌తో కలసి ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు బీజేపీకి ప్రజలు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను వారి మెజార్టీతో గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో కార్నర్ మీటింగ్ లో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు మద్దతుగా ఆ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన వడ్డెర సంఘం : కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బ్రాహ్మణ, ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘం విజ్ఞప్తి చేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండే నాయకులకి ప్రజలు ఓటు వేయాలనీ సాధుసంతులు కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం తెలిపింది. ప్రభుత్వరంగ సంస్థలను రక్షించుకోవడానికి కార్మిక వర్గమంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఎలక్షన్ వార్ - ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల దూకుడు - lok sabha elections 2024
రాష్ట్రంలో రాజకీయ వే"ఢీ"- క్లైమాక్స్‌కు చేరుకున్న ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024