Telangana Parliament Election Campaign : గురువారం నుంచి నామినేషన్లు పర్వం ప్రారంభమైంది. ఇప్పటి నుంచి భారీ సభా వేదికలు, వెల్లువల్లా ప్రజలను తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చేసిన అభివృద్ధిని వివరించేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతుండగా, హామీల అమలును ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు వారి ఉపన్యాసాలతో మాటల తూటాలు పేల్చడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి పార్టీ అగ్రనేతలు క్యూకట్టనున్నారు.
ముఖ్యమంత్రితో మొదలు : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్‌లోని రెండు స్థానాలపై కన్నేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే రెండు సభలు ఖరారు అయ్యాయి. నేడు మానుకోటలో పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ తరఫున భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే ఈనెల 24వ తేదీన వరంగల్ అభ్యర్థిని కడియం కావ్య తరఫున హనుమకొండలోని మడికొండ సభలో పాల్గొంటారు.
అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజే సీఎం సభలు ఉండేలా షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరంగల్, మానుకోట సభలో పాల్గొననున్నారు. వారితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనేలా త్వరలో ఈ షెడ్యూల్ వస్తుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
టార్గెట్ @ 15 - ప్రచారంలో జోష్ పెంచిన కాంగ్రెస్
ప్రధాని మోదీ రాక కోసం : అట్టహాసంగా నామపత్రాలు దాఖలు చేసేందుకు వరంగల్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ సిద్ధమయ్యారు. ఏప్రిల్ 24న నామపత్రాలు వేసే ముందు హనుమకొండ వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ రోడ్ షోను ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు షోలో ముఖ్య అతిథిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరుకానున్నారు. వరంగల్ లోక్‌సభపై కమలం గట్టి అంచనాలతో ఉన్నందున ప్రచారానికి ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.
అలాగే పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కిషన్‌రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా సభలు, రోడ్డు షోల్లో పాల్గొనేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవి అధిష్ఠానానికి ఒక లేఖను రాశారు. మోదీ సభను వరంగల్‌లో ఏర్పాటు చేయాలంటూ లేఖలో కోరారు.
రెండు చోట్ల కేసీఆర్ ప్రచారం : వరంగల్, మహబూబాబాద్ రెండు చోట్ల నిర్వహించే సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. వరంగల్ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్, మానుకోట అభ్యర్థిని కవిత తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఏప్రిల్ 23న వర్ధన్నపేటలో కేటీఆర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ర్యాలీలు, రోడ్డు షోల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం ఉమ్మడి వరంగల్‌లో ప్రచారం చేసే విధంగా బీఆర్ఎస్ ప్రణాళికలను రచిస్తోంది.
చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని 'హస్త'గతం చేసుకునే దిశగా కాంగ్రెస్ కసరత్తు