Telangana CM Revanth And AP CM Chandrababu Meeting : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం నేడు ప్రజాభవన్ వేదికగా జరగనుంది. సాయంత్రం 6 గంటలకు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి అంగీకరించారు. ఉమ్మడి ఏపీ పునర్ వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు కావడంతో హైదరాబాద్‌లోని ఆస్తులు, ఇతర పెండింగ్ అంశాలపై లోక్‌సభ ఎన్నికల ముందే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, గతంలోనే కేబినెట్ సమావేశం ఎజెండాలో పొందుపరిచింది.
అయితే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో అప్పుడు పక్కన పెట్టింది. ప్రజా భవన్లో రేపటి సమావేశానికి ఏర్పాట్లతో చర్చించాల్సిన అంశాలతో ఎజెండా సిద్ధం చేసింది. విభజన అంశాలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థలు, ఆస్తులపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సుమారు 30 సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు, తేలని చిక్కుముళ్లు, దానికి కారణాలపై సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు నివేదిక ఇచ్చారు. వివాదం నెలకొన్న భవనాలపై ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారు. ప్రజాభవన్‌లో ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలించారు.
తొమ్మిదో షెడ్యూల్లో మొత్తం 91 కార్పొరేషన్లు ఉండగా, అందులో ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ తదితర 23 కార్పొరేషన్ల వరకు రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. పదో షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉండగా, తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ వంటి 30 సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణ బకాయిలపై కూడా వివాదం ఉంది. విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. సుమారు రూ.24 వేల కోట్లు ఏపీ నుంచి రావాల్సి ఉందని తెలంగాణ, రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాలని ఏపీ వాదన.
జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసినందున ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, సీఐడీ కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్‌తో పాటు మినిస్టర్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్‌లో ఏపీకి కేటాయించిన వాటిని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. స్థానికత, ఐచ్చికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతో పాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రానుంది.
ఏపీలో విలీనమైన ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై కూడా చర్చించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల సీఎంను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విభజన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో మార్చి నెలలో దిల్లీలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది.