AIMIM Leader Asaduddin Owaisi about Party Alliance : తెలంగాణలో ఏ పార్టీలతోనూ తమకు ఎలాంటి పొత్తు లేదని ఏఐఎంఐఎం పార్టీ అధినేత, ఆ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఓవైసీ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు.
కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం సమానత్వ హక్కుకు విరుద్ధమని, ఈ చట్టాన్ని తాను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని పీడీఎం(PDM) కూటమి ఏర్పాటు చేశామని, తమ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Asaduddin Owaisi Comments on BJP : హైదరాబాద్ నియోజకవర్గంలోని బోగస్ ఓట్లు ఉన్నాయన్న బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆరోపణల గురించి ప్రశ్నించగా వారు ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్ కలిసి హాశమాబాద్, ఆల్ జుబైల్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓటర్లతో ముచ్చటిస్తూ ఎంఐఎం పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు.
Congress Leader Niranjan about MIM Party : ఇదికాగా మరోవైపు ఎంఐఎంతో దోస్తీ ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి విజయమే లక్ష్యంగా పని చేస్తోందని వెల్లడించారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. ఈ మధ్య కొందరు కాంగ్రెస్ పార్టీ మజ్లిస్‌తో అవగాహన కుదుర్చుకుంటుందని అపోహలు కల్పిస్తున్నారని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.
మజ్లిస్ బీజేపీకి బీ టీమ్ : కాంగ్రెస్‌ను బలహీన పరిచేందుకు బీజేపీయే ఈ పుకార్లును పుట్టిస్తోందని నిరంజన్ ఆరోపించారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ కూడా వీటిని నమ్మవద్దని, పదేళ్ల బీజేపీ(BJP) పరిపాలనో మజ్లిస్ బీజేపీకి బీ టీమ్‌గా పని చేసిందని ధ్వజమెత్తారు. మజ్లిస్ పట్ల మైనారిటీలలో పెరుగుతున్న అసంతృప్తిని తొలగించడానికే మోదీ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థికి ఇచ్చినట్లుగా కాంగ్రెస్ అభ్యర్ధికి కూడా వై కేటగిరీ భధ్రత కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.
'రాష్ట్రంలో ఏ పార్టీలతోనూ పొత్తు లేదు. మాకు క్లారిటీ ఉంది. మా కృషిపై మాకు నమ్మకం ఉంది. ఎంఐఎం పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది.'-అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ ఏఐఎంఐఎం అభ్యర్థి
మజ్లిస్, కాంగ్రెస్ మధ్య సయోధ్య - చేతిలోన చెయ్యేసి సర్కార్‌కు ఒవైసీ భరోసా!