AICC President Mallikarjun Kharge on Khammam MP Candidate : కాంగ్రెస్ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. పార్టీలో కీలక నాయకులుగా ఉన్న వారు ఎవరూ వెనక్కి తగ్గకపోడవడంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద సోమవారం ఉదయం బెంగళూరులో పంచాయితీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మొదట ఇద్దరితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించినట్లు తెలిసింది. తొలుత ఉప ముఖ్యమంత్రి భట్టి, తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరగా దానికి అంగీకరించలేదని తెలిసింది. దాంతో మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వర రావు పేరు సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరినప్పుడు తాను సూచించిన వ్యక్తికి లోక్‌సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని ఖర్గేతో భేటీలో పొంగులేటి తేల్చి చెప్పారు.
ఎవరికీ ఇచ్చినా కృషి చేయాలి : అసెంబ్లీ ఎన్నికల్లోనూ హామీ ఇచ్చిన మేరకు సీట్లు కేటాయించలేదని మంత్రి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. సోదరుడు ప్రసాద రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుపట్టినట్లు సమాచారం. పార్టీ నాయకులు రఘురామిరెడ్డి పేరును తెరమీదకు తెచ్చారన్న పొంగులేటి, ఆయనతో బంధుత్వం ఇటీవల కాలంలోనే ఏర్పడిందని చెప్పినట్లు తెలిసింది. ఇద్దరితో కలిసి చర్చించిన తర్వాత పార్టీ అధిష్ఠానం ముఖ్యులతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని, ఎవరికి ఇచ్చినా కలిసి విజయం కోసం పని చేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది.
తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖర్గేతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఖమ్మంనకు రఘురామిరెడ్డి, కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌కు షమీవలీ ఉల్లా పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యలో తెరపైకొచ్చిన మండవ వెంకటేశ్వరరావు పేరు పక్కకు వెళ్లినట్లు సమాచారం.
ఖమ్మం లోక్‌సభ స్థానానికి మొదటి నుంచి ముఖ్య నాయకుల మధ్య పోటీ ఉండటం అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి జటిలంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి తన భార్య నందినికి, మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాదరెడ్డికి, తుమ్మల తన కుమారుడు యుగంధర్‌కు టికెట్ ఇవ్వాలని కోరుతూ వచ్చారు. మంత్రుల కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడానికి అధిష్ఠానం నిరాకరించింది.