ACB Raids in Former Minister Jogi Ramesh House: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ కొరడా ఝళిపించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటలకే 15 మంది ఏసీబీ అధికారులు జోగి రమేష్ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేశారు. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించారు.
ఈ క్రమంలో రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలామంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కిందటి నెల రెండో వారం నుంచే ఏసీబీ ఈ కేసుపై దృష్టి సారించింది. వచ్చిన ఫిర్యాదులు, ఆధారాలపై నిశిత పరిశీలన జరుపుతూ వస్తోంది. ఇవాళ ఉదయం ఆకస్మిక తనిఖీలు జరిపింది.
జోగి ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో రాజీవ్ ఏ1గా ఉన్నట్లు గుర్తించారు. జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు ఏ2గా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల రెండో తేదీన మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆరు సెక్షన్ల కింద జోగి రమేష్ తనయుడు, అతడి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. 420, 409, 467, 471, 120(బీ), 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో రాజీవ్‌తో పాటు మరో 8 మందిపై కేసులు నమోదు చేశారు. ఏ-1గా జోగి రాజీవ్, ఏ-2గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు పేర్లు నమోదు చేశారు. వీరితోపాటు అడుసుమిల్లి మోహనరామదాసు, అడుసుమిల్లి వెంకటసీతామహలక్ష్మి, అంబాపురం సర్వేయరు కె.దీప్య, మండల సర్వేయర్ ఎ.రమేష్, డిప్యూటీ తహశీల్దారు జి.విజయకుమార్, తహశీల్దార్ పి.జాహ్నవిపై ఉన్నారు. జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం తదుపరి విచారణ కోసం గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
ఈ కేసు వెనుక అసలేం జరిగిందంటే!: ప్రభుత్వం జప్తు చేసిన భూములను కబ్జా చేసిన వ్యవహారంలో జోగి రమేష్, అతడి కుటుంబంపై ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. ఏకంగా సర్వే నెంబరు మార్చి తనయుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావు పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించి వాటిని వెంటనే విక్రయించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ బాగోతంలో జోగి రమేష్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తేగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
అక్రమంపై లోతైన విచారణకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏసీబీని ఆదేశించారు. విచారణలో తేలిన అంశాల ప్రకారం కేసు నమోదు చేశారు. అంబాపురంలో అగ్రిగోల్డ్ జప్తు చేసిన 10 కోట్ల రూపాయల విలువైన నివేశన స్థలాన్ని ఆక్రమించి విక్రయించారు. దీనిపై గత ప్రభుత్వంలోనే విజయవాడ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. జోగి రమేష్ దందా, అధికారుల వత్తాసుపై ఫిర్యాదు అందినా అప్పుడు పోలీసులు కేసు పెట్టలేదు.
ఆర్‌ఎస్‌ఆర్ ప్రకారం సర్వేనెంబరు 88లో పట్టాదారులుగా కనుమూరి సుబ్బరాజు, కనుమూరి వెంకట రామరాజు ఉన్నారు. దీనిలో 4 ఎకరాలను 1969లోనే బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించారు.. దీనిలో వారు ఒక ఎకరం 2001లో పి.మురళీమోహన్‌కు అమ్మేయగా, ఆయన 2014లో మహాలక్ష్మీ ప్రాపర్టీస్‌కు (ఎ.మోహన్‌రామదాసు) 3,800 గజాలు విక్రయించారు. అందులో జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావుకు 1,086 గజాలు, జోగి రాజీవ్‌కు 1,074 గజాలు 2022లో అమ్మారు.
తమ దస్తావేజుల్లో సర్వేనెంబరు తప్పుగా నమోదైందని స్వీయ సవరణ పేరుతో జోగి వెంకటేశ్వరరావు, రాజీవ్ ఇద్దరూ సర్వేనెంబరు 87గా మార్చుకుని మళ్లీ రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత వీటిని వై కార్పొరేటర్ చైతన్యరెడ్డి బంధువులకు సర్వేనెంబరు 87 మీద రిజిస్టర్ చేయించారు. అంబాపురం రీసర్వేనెంబరు 87లో అల్లూరి కృష్ణమూర్తికి, అక్కడి నుంచి అవ్వా వెంకట శేషునారాయణకు స్థలాన్ని విక్రయించినట్లు ఉంది. అవ్వా వెంకట శేషు నారాయణరావు కుటుంబం అగ్రిగోల్డ్ భాగస్వాములు. ఆర్‌ఎస్ నెంబరు 87లో 2293.05 గజాల స్థలాన్ని హోంశాఖ జప్తు చేసింది. జోగి రమేష్ తనయుడు 2022లో కొని 2023లో విక్రయించారు.